Singanamala Head Constable Abused Women in AP : 'ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామ పంచాయతీలోని శిలాఫలకాలు ధ్వంసం చేశారనే నెపంతో శింగనమల హెడ్ కానిస్టేబుల్ అంజనీరెడ్డి తమను కింద పడేసి ఇష్టానుసారం బూటుకాళ్లతో తన్నుతూ లాఠీలతో చితక్కొట్టారు. టీడీపీ గెలిస్తే మీకు కొవ్వు పెరిగిందా? అంటూ కులం పేరుతో దూషిస్తూ ఊరి మధ్యలో రోడ్డుపై పడేసి తన్నారు. చూడటానికి వచ్చిన మహిళలను 'మీకు పనేం లేదా? మిమ్మల్ని నగ్నంగా జీపు వెనుక కట్టి ఈడ్చుకుని పోతే చంద్రబాబు వచ్చి ఆపుతారా?’ అని దుర్భాషలాడారని శింగనమల మండలం సలకంచెరువు గ్రామానికి చెందిన బాధితులు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముందు వాపోయారు.
వెంటనే ఏపీలోని అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మంగళవారం ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుల్లో తెలిపిన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి..
- ‘పొలానికి వెళ్లొస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు బండరాయితో దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైఎస్సార్సీపీ నాయకులు అని చర్యలు తీసుకోలేదు. పైగా మమ్మల్నే ఊరొదిలి పోవాలని అప్పటి డీఎస్పీ చైతన్య హెచ్చరించారు’ అని అన్నమయ్య జిల్లాకు చెందిన సరోజ వాపోయారు.
- ‘మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ పెట్టినందుకు తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కక్ష గట్టి గతంలో నా హోటల్ మూయించారు. కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోలేదని అక్రమంగా కేసు పెట్టించి నేటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ అర్జీ అందించారు.
- ‘పరుగు పందెంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కలిపి 26 పతకాలు సాధించాను. నా తండ్రి తోపుడు బండిపై పండ్లు అమ్ముతారు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉండటంతో ఆటల్లో రాణించలేకపోతున్నాను. శిక్షణకు అయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తే నా సత్తా నిరూపిస్తాను’ అని వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా కోరారు.
- వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి వస్తే క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వాపోయారు. తమని క్రమబద్ధీకరించి 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. సొంత జిల్లాకు 120 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వర్తిస్తున్నామని, తమ ప్రాంతాలకు సమీపంలో విధులు కేటాయించాలని పలువురు హోంగార్డులు వినతి పత్రం అందించారు.
- తమ గ్రామానికి చెందిన పోరంబోకు, కాలువ భూములను హరిరాం అనే వ్యక్తి ఆక్రమించుకుంటున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన చెంగర్రాయ రెడ్డి ఫిర్యాదు చేశారు.
- పదవీ విరమణకు ముందు మూడు సంవత్సరాలు మాత్రమే బ్యాంకు స్కేల్ ఇచ్చారని విధులు నిర్వర్తించిన 35 ఏళ్ల కాలానికి ప్రభుత్వ ఉద్యోగుల్లా జీతాలు చెల్లించాలని డీసీసీ స్పెషల్ క్యాడర్ విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఆప్కాస్ ద్వారా విశాఖ కేజీహెచ్, అనకాపల్లి మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడంలేదని ఉద్యోగులు వాపోయారు.
ఎంపీ మిథున్ రెడ్డి రాకతో - పుంగనూరులో టెన్షన్ టెన్షన్ - AP MP Mithun Reddy pungauru Tour
ఓటమి భరించలేక దాడులు చేస్తున్న వైఎస్సార్సీపీ రౌడీ మూకలు - భయాందోళనలో కూటమి శ్రేణులు - YSRCP Followers Attack on TDP Leaders