Sabarimala Makara Jyoti Darshan : కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో కందమల శిఖరంపై మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. దీనితో హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.
మకరజ్యోతి విశిష్టత
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. అది చూసి మనసు నిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
41 రోజుల దీక్ష విరమణ
అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలిగి, నేరుగా భగవంతుడిని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు. ఇక రామాయణంలో కూడా శబరిమల ప్రస్తావన ఉండటం గమనార్హం. రాముడు పంబా నదీ తీరంలోని శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు చెబుతారు.
భక్తుల కోసం 800 బస్సులు
మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చిన భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంపా నుంచి అదనంగా 800 వందల బస్సులను ఏర్పాటు చేసింది.