Kidney Failure Symptoms in Telugu : డయాబెటిస్, హైబీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ మాదిరిగానే ప్రస్తుత రోజుల్లో కిడ్నీ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. పది మందిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇక ఒక్కసారి కిడ్నీలు దెబ్బతింటే, డయాలిసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే దెబ్బతిన్న మూత్రపిండాలు మామూలు స్థాయికి రావటం అసాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే త్వరగా పాడవకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చని అంటున్నారు. అయితే కిడ్నీలు దెబ్బతింటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మెజార్టీ ప్రజలకు తెలియదు. దీనివల్ల మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే వరకూ పసిగట్టలేకపోతున్నారు. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే, ముఖ్యంగా ఉదయం పూట ఈ సమస్య ఎదురైతే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అలసట, నీరసం: చాలా మందికి అలసటగా, నీరసంగా అనిపిస్తుంటుంది. ఈ కారణంతో ఉదయం నిద్ర లేవడానికి కూడా ఇబ్బందిపడతారు. మరి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణాలు కిడ్నీల వైఫల్యానికి సంకేతంగా చెబుతున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే రక్తహీనతకు దారితీస్తుందని, ఈ క్రమంలో శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోయి కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురితమైన అంశంలో కూడా దీనిని స్పష్టం చేశారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). కేవలం అలసట, నీరసం మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా కిడ్నీ వైఫల్యయానికి సంకేతాలుగా చెబుతున్నారు. అవేంటంటే,
ఆకలి లేకపోవడం: రక్తంలో విషతుల్యాలు పెరుగుతున్నా కొద్దీ ఆకలి సన్నగిల్లుతుందని, వికారంగా అనిపిస్తుందని అంటున్నారు. దీనివల్ల ఏ ఆహారం తినాలని అనిపించదని, ఫలితంగా బరువు తగ్గుతారని అంటున్నారు.
పొడి చర్మం, దురద : కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంలో క్యాల్షియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుందని అంటున్నారు. దీనివల్ల చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు.
పాదాల వాపు : కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోవని, దీనివల్ల మన బాడీలో ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ వాపు వస్తుందని అంటున్నారు.
మూత్రం ఎక్కువగా రావడం : కిడ్నీలు దెబ్బతింటే మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చని, దీనివల్ల రాత్రి సమయంలో అధికంగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం : బ్లడ్‌లో వ్యర్థాలు పోగవటం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తల తేలిపోవటం లక్షణాలు కనిపిస్తాయని, ఈ సమస్య తీవ్రమైతే మూర్ఛలకూ దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
నిద్రకు ఇబ్బంది: మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయనప్పుడు, టాక్సిన్స్ యూరిన్ ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లకుండా రక్తంలో పేరుకుపోతాయి. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడేవారిలో స్లీప్ అప్నియా సర్వ సాధారణమని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్, కిడ్నీ పేషెంట్స్ "గుండె" ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!
ఊబకాయులకు బిగ్ అలర్ట్ : అధిక బరువుతో కిడ్నీలకు తీవ్ర ముప్పు! - పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!!