తెలంగాణ

telangana

ETV Bharat / politics

పోలీసుల సాయంతో సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు : కేటీఆర్‌ - KTR PROTEST AT ASSEMBLY

అదానీతో రేవంత్‌ ఒప్పందాలను బయటపెడతామన్న కేటీఆర్​ - కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ కడుతున్నారని వ్యాఖ్య

Etv BharatBRS Protest against Government
BRS Protest against Government at Assembly (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 12:38 PM IST

Updated : Dec 9, 2024, 12:48 PM IST

BRS Protest against Government at Assembly : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి - అదానీ ఫొటో ముద్రించిన టీషర్టులు ధరించిన తమను అసెంబ్లీలో అనుమతించకపోవడంపై బీఆర్​ఎస్​ నేతలు మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ గేట వద్ద నిరసన చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపలకి అదానీ, రేవంత్‌ ఫొటోతో టీషర్టులు తొలగించి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయినా ఆ టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పడంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

అంతకముందు మాజీ మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ పార్లమెంటుకు రాహుల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు టీషర్టు ధరించి వెళ్లారని గుర్తు చేశారు. లగచర్ల ప్రజల తరఫున నిరనస తెలిపేందుకు వెళ్తున్నామని తెలిపారు. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. అదానీతో రేవంత్‌ అక్రమ ఒప్పందాలను బయటపెడతామని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ దుర్మార్గపు వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.

'దిల్లీలో రాహుల్​ గాంధీ, తమ పార్టీ నేతలు ఇదే టీషర్ట్​ వేసుకుని పార్లమెంట్​ ముందు నిరసన చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో అదానీ, రేవంత్​రెడ్డి మిత్రులు అని చెప్పడానికే ఈ టీషర్ట్​లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ రోడ్డు మీదనే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్నారు'- కేటీఆర్​, మాజీమంత్రి

తెలంగాణ తల్లిని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా ? : బతుకమ్మను తొలగించి కాంగ్రెస్‌ చెయ్యి గుర్తు పెట్టారని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా ? అని ప్రశ్నించారు. బతుకమ్మ గౌరవం తొలగించడం తెలంగాణ మహిళలను కించపరచడమేనని, కేసీఆర్‌పై కుట్రతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో చాలాచోట్ల ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ తల్లిని మార్చడమంటే రాష్ట్ర ప్రజలకు అవమానించినట్లేనని పేర్కొన్నారు.

అదానీ టీషర్టులు ధరించి కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటుకు వెళ్లారని, దిల్లీలో రాహుల్‌ గాంధీ టీషర్టులు ధరించి వెళ్తే తప్పులేదు కానీ తాము ధరించి వస్తే ఇబ్బందేంటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ఒక నీతి... రేవంత్‌రెడ్డికి మరో నీతి ఉంటుందా ? అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదు : కేటీఆర్

బీఆర్‌ఎస్‌కు అధికారం మాత్రమే పోయింది, పోరాటతత్వం కాదు: కేటీఆర్‌

Last Updated : Dec 9, 2024, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details