Horrific Ragging Incident In Kerala : కేరళ కొట్టాయం నర్సింగ్ కళశాల ర్యాగింగ్ ఉదంతానికి సంబంధించిన దారుణమైన దృశ్యాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. గాంధీనగర్ పోలీసులకు అందిన ఫుటేజీ ప్రకారం- ఓ విద్యార్థి బట్టలు అన్ని విప్పించి కదలకుండా మంచానికి కట్టేశారని పోలీసులు తెలిపారు. అనంతరం అతడి రహస్య అవయవాలపై డంబెల్స్‌ను ఉంచడం, నొప్పితో నోరు తెరిచినప్పుడు ఫేషియల్ క్రీమ్‌ను బలవంతంగా నోట్లో పోయడం, పదునైన వస్తువులతో గాయపరిచి, విపరీతమైన నొప్పి కలిగేలా గాయాలపై లోషన్ పోయడం వంటి వికృత చేష్టలను సీనియర్లు చేసినట్లు వెల్లడించారు.
స్థానిక టీవీల్లో ప్రసారం చేసిన దృశ్యాల్లో ఓ జూనియర్ విద్యార్థి - శరీరం అంతటా లోషన్‌తో మంచం మీద పడుకుని ఉన్నాడు. అతడి చేతులు, కాళ్లును తాడుతో కట్టారు. కదలలేని స్థితిలో నొప్పితో అతడి అరుస్తూ కనిపించాడు. అలా అరుస్తుండగా సీనియర్లు విద్యార్థి వివిధ భాగాలను కంపాస్‌తో గుచ్చారు. బిగ్గరగా "ఒకటి, రెండు, మూడు" అని లెక్కించారు. బాధితుడు నొప్పితో అరుస్తుండగా, నిందితులు ఆ జూనియర్ విద్యార్థిని ఎగతాళి చేశారు. ఈ దృశ్యాలను మూడో ఏడాది విద్యార్థులు రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని నిందితులు వేధించేవారని, ఇవ్వకపోతే దాడి చేసేవారని పోలీసులు తెలిపారు. మద్యం తాగేలా బలవంతపెట్టి, ఆ దృశ్యాలను చిత్రించి బెదిరించేవారన్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు గురయ్యారా లేదా అనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు కొట్టాయం జిల్లా పోలీసు చీఫ్ షాహుల్ హమీద్ తెలిపారు. కళాశాల అధికారుల వైపు నుంచి ఏవైనా లోపాలు ఉన్నాయా అని కూడా దర్యాప్తులో పరిశీలిస్తామని చెప్పారు.
సీనియర్ల వేధింపులు భరించలేని ముగ్గురు విద్యార్థులు తల్లిదండ్రుల సూచన మేరకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు ర్యాగింగ్ నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 118(1), 308(2), 351(1), 3(5) కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీనియర్ నర్సింగ్ విద్యార్థులైన శామ్యుల్ జాన్సన్, రాహుల్ రాజ్, జీవ్, రిజిల్ జీత్, వివేక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాగింగ్ ఆరోపణల కారణంగా ఆ ఐదుగురు సీనియర్ విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.