Reasons for Hair Fall in Children: అందంగా కనిపించడంలో ముఖం పాత్ర ఎంత ఉంటుందో, జుట్టు పాత్ర కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే జుట్టు పొడుగ్గా, ఆరోగ్యంగా ఉంటే మనం కూడా అందంగా కనిపిస్తాం. అయితే ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇలా పట్టుకుంటే అలా విపరీతంగా రాలిపోతుంటుంది. కేవలం యువత, వయసు పైబడిన వారిలో కనిపించే ఈ సమస్య చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. మరి ఇందుకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న పిల్లల్లో జుట్టు రాలితే కంగారు పడాల్సిన పనిలేదని ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. జుట్టు ఊడినా తిరిగి వస్తుందని, మచ్చలు లేనంతవరకూ భయపడాల్సిన పనిలేదని వివరిస్తున్నారు. గట్టిగా జుట్టు లాగికట్టడం, వెంట్రుకలతో ఆడటం వల్ల కూడా జుట్టు ఊడుతుందని చెబుతున్నారు. అలాగే వంశపారంపర్యంగానూ ఈ సమస్య వస్తుందని, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లూ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే కొందరిలో పొలుసుల్లా ఉండి, దురద, దద్దుర్లూ కనిపిస్తాయని వివరిస్తున్నారు. ప్యాచ్‌లుగా జుట్టు రాలుతోంటే అలోపేషియా ఏరియేటా అంటామని, దీనిలోనూ చాలా సందర్భాల్లో వెంట్రుకలు తిరిగి పెరుగుతాయని, కొన్నిసార్లే పెరగవని పేర్కొంటున్నారు.
ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండాలి: సాధారణంగా జుట్టు ఊడిపోతే ఎటువంటి సమస్య లేదు కానీ, కొన్నిసార్లు పిల్లలే వెంట్రుకలు లాగడం, పీకడం లాంటివి చేస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఇలా చేసే వారికి నిపుణులతో కౌన్సెలింగ్ చేయించాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తాయి, కాబట్టి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, అలాగే మానసికంగానూ వారికి సపోర్ట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా టైఫాయిడ్, మలేరియా వంటివి వచ్చినా శిరోజాలు రాలతాయని చెబుతున్నారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు అయితే ట్రీట్‌మెంట్ తప్పనిసరని చెబుతున్నారు. పైన చెప్పినవి ఏమీ లేకుండా కేవలం జుట్టు రాలడమే అయితే హెయిర్ స్టైల్స్, గట్టిగా లాగి దువ్వడం, వదులవుతుందని బిగుతుగా జడవేయడం కారణం కావొచ్చని, కాబట్టి అలాంటివి చూసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
ఇవి కూడా: అంతేకాకుండా ఐరన్, బయోటిన్ వంటివి శరీరానికి అందుతున్నాయా అనేది చూసుకోవాలని, ఒత్తిడి ఉందేమో కూడా గమనించాలని సలహా ఇస్తున్నారు. ఇక రోజువారీ ఆహారంలో గుడ్డు, సోయా, పనీర్, ఆకుకూరలు, చేప, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలని, వీటి వల్ల కావాల్సిన పోషకాలూ అందుతాయని అంటున్నారు. వీళ్లకు మైల్డ్ షాంపూలనే వాడాలని సలహా ఇస్తున్నారు. కాగా, ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి కురులు ఆరోగ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ జుట్టు తత్వాన్ని బట్టే తలస్నానం చేయాలట- ఆ షాంపూలు వాడొద్దని నిపుణుల సలహా!
మీ జుట్టు తీవ్రంగా రాలుతోందా? - తమలపాకుతో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందట!