Kumbh Mela 2025 WhatsApp Snanam debunked : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26వ జరగనుంది. గంగా, యయున, సరస్వతీ నదుల సంగమమైన ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే వ్యయప్రయాసాలకు ఓర్చి కుంభమేళాకు వస్తున్నారు. అదికూడా 144 సంవత్సరాలకోసారి జరిగే కుంభమేళా కావడంతో విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.
అయితే, కొందరికి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ, పరిస్థితుల కారణంగా వెళ్లడానికి అవకాశం ఉండదు. ఇలాంటి వారికోసం ప్రత్యేక అవకాశం అంటూ ఒక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 500 రూపాయలతోనే మీ అకౌంట్లో పుణ్యం క్రెడిట్ అవుతుందని చెబుతున్నారు. మంచి తరుణం మించిపోతే దొరకదని ఊరిస్తున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో మీరూ తెలుసుకోండి.
భక్తులకు గోల్డెన్ ఛాన్స్ అంటూ :
కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయలేని వారికి గోల్డెన్ ఛాన్స్ అంటూ ఓ లేఖ వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే, "కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం చేయలేక పోతున్నారా? మరేం పర్వాలేదు. మీ ఫొటోలను వాట్సాప్ లో పంపించండి. వాటిని మేము ప్రింట్ తీసి, మీ ఫొటోలకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయిస్తాం. దాంతో మీ పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది" అనే సమాచారం ఉంది.
![సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్ ఇదే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23537379_kumbh.png)
ఇంకా మరికొంత సమాచారం కూడా ఉంది. "కుంభమేళా మరి కొద్దిరోజులే ఉంది. ఆలస్యం చేస్తే ఈ అవకాశం మళ్లీ రాదు. త్వరపడండి" అని రాసి ఉంది. వార్తా పత్రికలో ఇచ్చే ప్రకటన మాదిరిగా ఉన్న ఈ అడ్వర్టైజ్‌మెంట్ క్లిప్ లో కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. అయితే, ఇది ఉచిత సేవ కాదని, ఈ పని చేసిపెట్టినందుకు ప్రతిఫలంగా రూ.500 దక్షిణ సమర్పించాలని అందులో పేర్కొన్నారు.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇలా కూడా పుణ్యస్నానాలు చేయిస్తారా? నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలేంటో తెలియదుగానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం జోరుగా ఫార్వార్డ్ అవుతోందీ సమాచారం.
ఇవి కూడా చదవండి :
మహాకుంభ మేళాలో రాజస్నానం- ఇలా చేస్తే మోక్షప్రాప్తి తథ్యం!
మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!