Google AI Center In Hyderabad : ఐటీ పరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ దూసుకుపోనుంది. రాబోయే రోజుల్లో ఎంతో కీలకం కానున్న ఏఐ సాంకేతికను అభివృద్ధి పరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి రెండు అంతర్జాతీయ సంస్థలు తమ సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఏఐ సిటీలో భాగస్వామ్యం కావడానికి రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల బృందం వేర్వేరుగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
![హైదరాబాద్‌లో గూగుల్ ఏఐ కేంద్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23536428_google-ai-center-in-hyderabad.png)
హైదరాబాద్‌లో గూగుల్ ఏఐ కేంద్రం : హైదరాబాద్ సిటీలో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. టీహబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో గూగుల్ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు గూగుల్ తోడ్పాటునందించనుంది. విద్య, వ్యవసాయం, రవాణా రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
![హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23536428_google-ai-center-in-hyderabada.png)
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ : మరోవైపు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాాబాద్ను ఐటీ హబ్‌గా మార్చడంలో మైక్రోసాఫ్ట్ సహకారాన్ని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్‌లు ఏఐ సిటీలో కృత్రిమ మేథ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడంతో వాటిని ఆదర్శంగా తీసుకొన్ని అంకుర పరిశ్రమలతో పాటు ఇతర పెద్ద కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.