Deputy CM Bhatti Vikramarka on Economic Situation of Telangana :ప్రజాప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా తాము పరిపాలన కొనసాగిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. సాగు నీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని వివరించారు. ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని హెచ్చరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఇక్కడకు వచ్చానని తెలియజేశారు.
బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Comments on Rythu Bandhu : రైతు బంధు ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారన్నారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, ఉచిత బస్సు ప్రయాణాలకు నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు. గృహలక్ష్మి కింద ఆర్టీసీకి ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.1,120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.
"విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,924 కోట్లు విడుదల చేశాం. ప్రజలకు ఒక్కటే చెబుతున్నాం. ఎక్కడా పవర్ కట్ లేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నిర్వహణలో భాగంగా ఎక్కడైనా కాసేపు కరెంట్ కోతలు ఉండవచ్చు. అలాంటి కరెంట్ కోతలను పవర్ కట్‌గా భావించకూడదు. మేం వచ్చాక రైతుబీమా నిధులు రూ.734 కోట్లు చెల్లించాం. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. మహిళల చేతిలో డబ్బు ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి