Lok Sabha Elections 2024 :మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంబానీ, అదానీ వంటి వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయం : రాహుల్ గాంధీ - lok sabha elections 2024
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి రాష్ట్రంలోని పేదల వివరాలు సేకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ ధనికులకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టారని, మోదీ ధనికులకు ఇచ్చిన డబ్బును మేము పేద మహిళల ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతురుణమాఫీ, మద్దతు ధర అనే రెండు ప్రధాన హామీలు ఉన్నాయని గుర్తు చేశారు.
పట్టభద్రులు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు నైపుణ్య శిక్షణ కల్పిస్తామని, రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.8500 శిక్షణ భృతి ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఇచ్చే రోజువారీ కూలీని రూ.400కు పెంచుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తోందని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.