Phone Tapping Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ఫోన్లను ప్రభాకర్‌రావు బృందం ట్యాప్ చేసినట్లు నిర్ధరించిన పోలీసులు తాజాగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి సంభాషణలు విన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ(OSD) నర్సింహులు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్నా నేటికీ సంచలన విషయాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ(OSD) నర్సింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి-ఐఎస్బీ కేంద్రంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఆ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు రెండ్రోజులక్రితం నర్సింహులును పిలిచి విచారించారు. మీరు చెప్పేవరకు ఆ విషయం తనకు తెలియదని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం.
ప్రభాకర్‌రావును విచారిస్తేనే అంతా తెలుస్తుంది : ఈ నంబర్‌ని ట్యాప్‌చేయాలని ISBని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారిస్తేనే తెలుస్తుంది. ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు ఎన్ని యత్నాలుచేస్తున్నా సఫలీకృతం కావట్లేదు. రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌నూ ట్యాప్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగినా.. దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకు అలాంటి అంశం వెల్లడి కాలేదని సమాచారం.2014 నుంచి తన OSD పేరిట ఉన్న ఫోన్ నంబరునే ఇంద్రసేనారెడ్డి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ నంబరును ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్‌జాబితాలో చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
2023 అక్టోబరు 18న త్రిపుర గవర్నర్‌గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి అదేనెల 26న బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అప్పటికే ట్యాపింగ్ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో ఆయన నంబరునూ చేర్చినట్లు సమాచారం. బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌లీడర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి పార్టీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండటంతో అగ్రనాయకత్వంతో సత్సంబంధాలున్నాయి.
ఏ మాత్రం జంకు లేకుండా గవర్నర్ ఫోన్ ట్యాప్ : ఈనేపథ్యంలోనే కేంద్రంలోని కీలక రహస్యాలు తెలుస్తాయనే ఉద్దేశంతో గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఫోన్‌ను ప్రభాకర్‌రావు బృందం ఏమాత్రం జంకు లేకుండా ట్యాప్ చేసేందుకు తెగించినట్లు అనుమానిస్తున్నారు. ఐఎస్బీ చీఫ్‌గా ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు ఆ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్ఐబీలోనే డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావు ద్వారా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ను యథేచ్ఛగా సాగించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ దందా పతాకస్థాయికి చేరింది. అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్కి లబ్ధి చేసేందుకు ప్రభాకర్‌రావు బృందం అడ్డగోలుగా వ్యవహరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు, ఆర్థిక వనరులు సమకూర్చే వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. కీలక వ్యవస్థల్లోని ప్రముఖులు, హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు తేలడం నివ్వెరపోయేలా చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కదులుతున్న డొంక - మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు?