Meerpet Murder Case Update : కొట్టిన దెబ్బలకు భార్య మరణం, ఆ విషయం అత్తారింట్లో తెలిస్తే ఎలా స్పందిస్తారోనని అనుమానం, పోలీసు కేసు భయం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భార్య మృతదేహాన్ని మాయం చేయాలని అనుకున్నాడు. సంచలనం సృష్టించిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను హత్య చేసిన గురుమూర్తి, మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో రెండు గంటలు వెతికాడు. గతంలో చూసిన వెబ్ సిరీస్‌ల ప్రేరణతో భార్య మృతదేహాన్ని 3 ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశాడు.
రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో కలకలం రేపిన వెంకటమాధవి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సైనిక ఉద్యోగి, భర్త గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్‌లో వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం గురుమూర్తి, వెంకటమాధవి మధ్య గొడవ జరిగినట్లు గుర్తించారు. తలను గోడకు గట్టిగా కొట్టగా ఆమె మరణించింది. మాధవి మరణంతో గురుమూర్తి ఆలోచనలో పడ్డాడు.
గతంలో సొంతూరులో మరో మహిళతో సంబంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు. దీంతో అంతర్జాలంలో రెండు గంటల పాటు మృతదేహం ఎలా మాయం చేయాలని వెతికాడు. ఈ క్రమంలో గతంలో చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతం గురించి తెలుసుకున్నట్లు సమాచారం. అప్పట్లో నర్సును చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తీరు తెలుసుకోవడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లతో ప్రేరణ పొందాడు.
హ్యాక్సా బ్లేడుతో మృతదేహం కటింగ్ : అంతర్జాలంలో శోధించిన గురుమూర్తి ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో మృతదేహం నుంచి తలను వేరు చేసి మొండేన్ని మూడు ముక్కలు చేశారు. ఆ తర్వాత బకెట్ వేడి నీటిలో ముక్కల్ని ఉడకపెట్టిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారాయి. ఆ సమయంలో అపార్టుమెంట్లు, పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వినియోగించాడు. సాయంత్రం వరకు ఆ పని పూర్తి చేసి మీర్‌పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు.
మాధవి మృతదేహామేనని ప్రాథమికంగా నిర్ధారణ : నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక ఫోరెన్సిక్, క్లూస్ టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు గురుమూర్తి నివాసంలో తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ దగ్గర కొన్ని రక్తం ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషిస్తున్నారు. అవన్నీ వెంకట మాధవి మృతదేహానివేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. హత్య కేసుపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఊర్లో జరిగిన ఆ పెద్ద గొడవ - ఇల్లాలి ప్రాణం తీసే వరకు ఆగలేదు!
'ఆమెతో కలిసి ఉండేందుకే' - మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు