Karimnagar Mayor Sunil Rao joins BJP : కరీంనగర్ మేయర్ సునీల్‌రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ మేరకు సునీల్‌రావుకు కేంద్రమంత్రి బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల విషయంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా ఉన్నందువల్ల అభివృద్ది కొనసాగాలని బీజేపీలో చేరుతున్నట్లు మేయర్ సునీల్‌రావు స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తనకు లేదని ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు జరగలేదని ఘంటాపదంగా చెప్పగలనని అన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయజెండా ఎగురవేస్తాం : ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావు ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగులకు కమీషన్లు ముడితే చాలని పనుల గురించి పట్టించుకోరని విమర్శించారు. కరీంనగర్లో జరిగిన ప్రతి కుంభకోణంలో గంగుల పాత్ర ఉందని సునీల్ మండిపడ్డారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని వివరించారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరాభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం మౌనంగా ఉన్నానని స్పష్టం చేశారు. రోడ్లు, చెక్‌డ్యామ్‌ల కాంట్రాక్టర్లు అందరూ బినామీలేనని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని విమరించారు. త్వరలో మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని సునీల్‌రావు అన్నారు.
అవినీతికి పాల్పడిన వారి చిట్టా నా దగ్గర ఉంది : పార్టీలో కొందరు అనుయాయులతో తనపై విమర్శలు చేయిస్తున్నారో తనకు తెలుసని సునీల్‌రావు వివరించారు. తనపై విమర్శలు చేయిస్తున్న వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో నా దగ్గర చిట్టా మొత్తం ఉందన్న ఆయన త్రిబుల్ వన్ జీఓలో భూములు ఎక్కడెక్కడ కొన్నారో, ఖాజీపూర్ ఇసుక క్వారీ అక్రమాలు, మానేరు రివర్ ఫ్రంట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.