BJP Strategy In Delhi Assembly Election : దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా, 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21 వేల ఆర్థిక సాయం, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది.
బూత్ నుంచి పక్కా ప్రణాళిక!
దిల్లీలో విజయం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ప్రతి బూత్‌లో కనీసం 50శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20 వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్ఠానం దిశా నిర్దేశం చేసింది. గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వస్తోంది. తద్వారా వ్యతిరేక ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు వారితో మంతనాలు జరుపుతోంది.
'దిల్లీ విచ్చేయండి- మాకే ఓటేయండి'
కొవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది దిల్లీ వదలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలుస్తున్నారు. అవసరమైతే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి దిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్ఠానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. రాజధాని దిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి వలస వెళ్తుంటారు. ఈ ఓటర్లందర్నీ తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
తెలుగు ఓటర్లు ఎటువైపో?
దిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా. వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ, తెలుగుదేశం నేతలను వారితో టచ్‌లో ఉండాలని పురమాయించింది. అలాగే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌కు చెందిన పలువురు బీజేపీ నేతలు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బూత్ బాధ్యత జాతీయస్థాయి నాయకులదే!
బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయస్థాయి నాయకులకు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్ఠమైన బాధ్యతలు అప్పగించింది. కేంద్రమంత్రులు ఒక్కొక్కరికీ రెండు నియోజకవర్గాలను కేటాయించి అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ వారే బాధ్యులని పేర్కొంది. క్షేత్ర స్థాయిలో పని చేసే బృందం ప్రతిరోజూ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రతి నియోజకవర్గాన్ని BJP కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని, అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ సాయం కూడా తీసుకుంటోంది. పార్టీ నేతలకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు.
'అధికారమే లక్ష్యం అగ్రనేతల పర్యటనలు'
దిల్లీలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వీరికి తోడు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు ఇలా అందరూ దిల్లీలో మకాం వేశారు. బీజేపీని విజయ తీరాలకు చేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.