CM Revanth Corner Meeting in Warangal : రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓటమి తర్వాత అయినా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించాం కానీ, ఆయనలో మార్పు రాలేదన్నారు. అది చాలదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటున్నారని మండిపడ్డారు.
PCC Chief Revanth Fires on KCR :లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలోనే కేంద్ర సర్కార్‌పై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి తాను అల్లాటప్పాగా రాలేదని, ఉద్యమం పేరిట అమాయకులైన పిల్లన్ని చంపి పదవిలోకి రాలేదని తెలిపారు. నిరంకుశ ప్రభుత్వంపై పదేళ్లు పోరాడి సీఎం కుర్చీలో కూర్చున్నాన్న రేవంత్‌రెడ్డి, పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ దిగిపోవాలని కేసీఆర్ ఎందుకు అనడం లేదని ధ్వజమెత్తారు.
"వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలను తీసుకురావాలని సభా వేదికగా అధికారులను ఆదేశిస్తున్నాను. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దే బాధ్యత నాది. జరగబోయేది కేవలం ఎన్నికలు కావు. ఈ మహాసంగ్రామంలో కాకతీయ పౌరుషాన్ని చూపించి దిల్లీ సుల్తాన్‌లను ఓడించాలి. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకి లక్ష మెజారిటీ ఇవ్వాలి."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
గుజరాత్ టీమ్‌ను డకౌట్ చేసి చిత్తుచిత్తుగా ఓడించాలి : తన కుమార్తె బెయిల్ కోసం ఎంపీ సీట్లను ఆయన మోదీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికలు తెలంగాణ, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ లాంటివని, బీజేపీని డకౌట్ చేసి, గుజరాత్‌ను ఓడించాలని ప్రజలకు సీఎం కోరారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో పెట్టారని తెలిపారు.