BRS Disqualification Petition Filed on Party Defections : నేతల వలసలు భారత రాష్ట్ర సమితి పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేతలు ఒక్కొక్కరు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతుండడం గులాబీ పార్టీకి సవాలుగా మారుతోంది. పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులు కూడా వీడుతుండటం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయాలని బీఆర్‌ఎస్(BRS) అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చూడడం ద్వారా ఇతర శాసనసభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చన్నది ఆలోచన.
అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఇప్పటికే అనర్హతా పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ(Congress Secunderabad MP) అభ్యర్థిగా కూడా ఆయన పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆ ఆధారాన్ని కూడా ఉపయోగించుకొని అదనపు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అదనపు అఫిడవిట్ తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రిజిష్టర్ పోస్ట్ ద్వారా, ఇతర మార్గాల్లో సభాపతి కార్యాలయానికి పంపారు.
వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : కేసీఆర్
BRS on Party Defections :ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరొక పార్టీ ఎన్నికల అభ్యర్థి కావడానికి మించి అనర్హతా వేటుకు ఆధారం అవసరం లేదని బీఆర్‌ఎస్ అంటోంది. అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని ఆ పార్టీ చెబుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పైనా అనర్హతా పిటిషన్ దాఖలుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఒకటి, రెండు రోజుల్లో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దానం నాగేందర్ వ్యవహారంలో సభాపతి స్పందన కోసం ఆదివారం వరకు ఎదురు చూస్తామని, ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
ఇంకా ఎవరు పార్టీని వీడినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనర్హతా పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నేతలకు స్పష్టం చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా ఛైర్మన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన రాజ్యసభ సభ్యుడు కేశవరావు అవసరమైతే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో కొంత సమయం తీసుకొని కేకే వ్యవహారంలో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నేడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి ఆ ఎమ్మెల్యే విషయంలో కూడా బీఆర్‌ఎస్ ఈ విధంగా అనర్హత పిటిషన్ వేస్తుందేమో చూడాలి.
కేసీఆర్ పొగరు వల్లే బీఆర్‌ఎస్ పార్టీ 104 ఎమ్మెల్యేల నుంచి 39కి చేరుకుంది : మంత్రి ఉత్తమ్
పదేళ్ల అభివృద్ధికి, కాంగ్రెస్ అబద్ధాలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి : కేటీఆర్