BRS Executive Meeting : బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. కార్పొరేషన్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు హాజరుకానున్నారు. ఏడు నెలల విరామం తర్వాత కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. గతేడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన, తిరిగి మళ్లీ నేడు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తిచేసుకోనుంది. పాతికేళ్లవేళ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాగా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది.
పార్టీసభ్యత్వ నమోదుతోపాటు సంస్థాగత కమిటీలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టతనిచ్చేఅవకాశముంది. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పలు సందర్భాల్లో ఆ విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యనేతలు సైతం త్వరలోనే సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేస్తామని, వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేశారు. పార్టీ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో సభ్యత్వ నమోదుతోపాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నేటి కార్యావర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించడం సంప్రదాయం.
లోక్‌సభ ఎన్నికల కారణంగా గతేడాది ప్లీనరీ జరపలేదు. ఈఏడాది ప్లీనరీ లేదా బహిరంగసభ నిర్వహించే అంశంపై సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరన బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ మొదట భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. రజతోత్సవ ఏడాది చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు గులాబీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుందని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ హక్కులను కాపాడుకునే దిశగా ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కొంత విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం అవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
నేను కొడితే మామూలుగా ఉండదు - కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్