Telangana BJP Focus on Selection of State New Chief :రాష్ట్ర కాషాయ దళపతి ఎంపికపై కసరత్తు షురూ అయింది. పార్టీని ముందుకు నడిపే నాయకుడి ఎంపిక కోసం దిల్లీలో మథనం సాగుతోంది. ఇప్పటికే అధిష్ఠానం ఒక్కో రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటూ వస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న హరియాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్‌లాల్ బడోలీని ఎంపిక చేసింది.
కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్రాల అధ్యక్షుల నియామకం ఉంటుందని తొలుత భావించినప్పటికీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే జాతీయ ఎంపిక చేయనున్నట్లు సమాచారం. రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. త్వరతిగతిన రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది.
కీలకం కానున్న రాష్ట్ర రథసారథి పాత్ర :త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహాదం చేస్తాయని కాషాయ సైనికులు భావిస్తున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా ఓట్లు, సీట్లను గెలుచుకుని 2028 ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని యోచిస్తోంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర రథసారధి పాత్ర కీలకం కానుంది. అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లతో పాటు సమీకరణాలను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. శ్రావణమాసం లోపు ఎంపిక తంతును ముగించి ప్రకటించాలని యోచిస్తోంది.
అధ్యక్ష రేసులో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. ఒకదశలో ఆయన పేరు ఖరారైనట్లు ఈటల అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆయనకు పోటీగా పలువురు రేసులో ఉన్నారన్నది అంతే గట్టిగా వినిపిస్తున్న మాట. ఎంపీలు డీకే.అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే అపవాదు మోస్తున్న బీజేపీ : శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్లింది. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు వాగ్ధానం చేసింది. ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ఎనిమిది సీట్లను గెలుచుకుంది. అధికారంలోకి రాకపోయిన శాసనసభాపక్షనేతను బీసీని చేస్తారనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటీ మహేశ్వర్ రెడ్డికి కట్టబెట్టింది.
పార్టీలోని బీసీ వర్గం ఆగ్రహాంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేతలు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీంతో బీసీలకు అన్యాయం చేశారనే అపవాదును రాష్ట్ర బీజేపీ మోస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ర్ట అధ్యక్షుడిగా బీసీని నియమించాలని పార్టీ పెద్దలు భావిస్తుంటే బండారు, లక్ష్మణ్ తరువాత దళితులకు ఈ పదవి దక్కలేదు. ఈ సారి ఎస్సీ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని ఆ వర్గం నేతలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.