Mallikarjun kharge Comments on Modi : ఈ లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ, దాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ మధ్య జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చకూడదని అనుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆత్మీయ మిత్రులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆయన తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జవహర్లాల్ నెహ్రూ కాలంలో స్థాపించిన పెద్ద సంస్థలను సైతం మోదీ తీసేశారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో చందాలు ఇచ్చిన వారికే మోదీ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిపై రూ.13వేల కోట్ల ట్యాక్స్ వేసి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మోదీ హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని వాగ్దానం పెండింగ్‌లోనే ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు.
వాగ్దానాలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ :2024 పంద్రాగస్టు నాటికి రైతుల రుణమాఫీ చేసి తీరుతామని ఖర్గే పేర్కొన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిచి చూపిస్తామని ఉద్ఘాటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాంచ్ న్యాయ్, 25 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. కులగణన, జనగణన చేసి అందరికీ న్యాయం చేస్తామని, కుల గణన చేశాకే ప్రతి మహిళకు రూ. లక్ష నగదు జమ చేస్తామని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ స్పష్టం చేశారు.