అమెరికా మాజీ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచారర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగాయి.. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్ లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంగా అమెరికా మీడియా పేర్కొంది.. ట్రంప్‌పై కాల్పుల ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 గంటలకు జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు.. ప్రచార ర్యాలీకి వేలాదిమంది తరలివచ్చినట్లు చెప్పారు.. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేసింది.. దీంతో కాల్పుల దృశ్యాలు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ రికార్డయ్యాయి.. బుల్లెట్ ట్రంప్ చెవి పైనుంచి దూసుకెళ్లడం. ఆయనకు రక్తస్రావం కావడంసహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి.. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్. పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా మారి బయటకు తీసుకెళ్లారు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ సమయంలో ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు.. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్ ప్రచార ర్యాలీ సమీపంలోని భవనం పైనుంచి దుండగుడు కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు.. ర్యాలీకి వచ్చిన ఆగంతకుడు తుపాకీతో భవనంపైకి వెళ్లటం చూసినట్లు చెప్పారు.. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనతో వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. దాదాపు ఆరురౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు