- మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు
- ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు
- ఒక్కసారిగా మారిన హిమాచల్ ముఖచిత్రం!
- బీజేపీ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
- త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు?
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణమేంటి?
- బీజేపీ ఆపరేషన్ కమలం ఎప్పుడో మొదలుపెట్టిందా?
Himachal Pradesh Politics Today : ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వీటిపైనే చర్చ! మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 35 సభ్యులు కాగా, రాజ్యసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి 34 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్లు తేలిపోయింది. ఇక ఈ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఒక్కసారిగా అంతా ఛేంజ్!
అయితే రాష్ట్రంలో ఎన్నిక జరిగిన ఒక్కే ఒక్క రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాతో కాంగ్రెస్ పోలింగ్ జరిగే ముందు వరకు ఉంది. కానీ పోలింగ్ జరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీకి 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడం వల్ల లాటరీ తీయగా, బీజేపీ నేత హర్ష్ మహాజన్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పరాజయం పాలయ్యారు
కాంగ్రెస్ను గద్దె దించడమే టార్గెట్
అసెంబ్లీలో అధికార కాంగ్రెస్కు బలం తగ్గడం వల్ల బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా కాంగ్రెస్ను గద్దె దించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీజేపీ ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్ సహా పలువురు నేతలు కలిశారు. అయితే శాసనసభలో అధికార కాంగ్రెస్ తీరుపై ఫిర్యాదు చేసేందుకే గవర్నర్‌ను కలిశామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు హర్ష్ మహజన్ మాత్రం కాంగ్రెస్ గద్ది దిగే సమయం వచ్చిందని వ్యాఖ్యానించడం గమనార్హం. అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు.
అసలు కారణం ఇదే!
అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడం హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో తొలిసారి. సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అసంతృప్త ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని సుఖు ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుందని, ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పాయి. వారితో మంతనాలు జరిపేందుకు కూడా ప్రభుత్వం పెద్దగా మొగ్గుచూపనట్లు తెలుస్తోంది.