ETV Bharat / opinion

తడబాటు X దూకుడు- అమెరికా ప్రజాస్వామ్యానికి పరీక్ష - US Election 2024 Biden VS Trump - US ELECTION 2024 BIDEN VS TRUMP

US Presidential Election 2024 Biden VS Trump : 'అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్ చివరి వరకు నిలవడం సాధ్యమేనా? కేసుల చిక్కుముడులు, జైలుశిక్షల ముప్పులను అధిగమించి బైడెన్​ను ఢీకొట్టగలరా?'- కొంతకాలం క్రితం వరకు వినిపించిన ప్రశ్నలివి. ఇప్పుడు లెక్క మారింది. అమెరికా రాజకీయం ఒక్కసారిగా యూటర్న్ తిరిగింది. ట్రంప్ వర్గం ఉరిమే ఉత్సాహంతో విజయతీరాలవైపు పరుగులు తీస్తోంది. బైడెన్​ పార్టీ మాత్రం బేలచూపులు చూస్తోంది. ఎందుకిలా? అమెరికా రాజకీయం ఒక్కసారిగా ఇలా మారిపోవడానికి కారణమేంటి? మున్మందు ఏం జరగనుంది?

US Presidential Election 2024 Biden VS Trump
US Presidential Election 2024 Biden VS Trump (AssociatedPress)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 3:34 AM IST

US Presidential Election 2024 Biden VS Trump : అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్య రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రపంచగతిని ప్రభావితం చేయగల నాయకుడిని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన మహాసంగ్రామం ఇద్దరు వ్యక్తుల తడబాటు, దూకుడుకు మధ్య పోటీగా మారింది. రెండోసారి అగ్రరాజ్యాధినేత కావాలని అభిలషిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​(81) వృద్ధాప్య సమస్యలు అధికార డెమొక్రటిక్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కన్నా, డెమొక్రాట్ల చర్చలు, వ్యూహరచనలన్నీ అధ్యక్ష అభ్యర్థిని మార్చాలా, లేదా అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా విపక్ష రిపబ్లికన్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్(78) అధ్యక్ష అభ్యర్థిత్వం, విజయావకాశాలపై కొంతకాలం క్రితం వరకు క్రిమినల్ కేసుల రూపంలో ఉన్న నీలిమేఘాలన్నీ ఒక్కసారిగా తొలగిపోవడం ఆ పార్టీలో కొండంత ఉత్సాహం నింపింది. అయితే, ఇలాంటి రసవత్తర మలుపులతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా రాజకీయం, ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచింది. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక రంగం, వలసలు, పన్నులు, వైద్య బీమా, గర్భవిచ్ఛిత్తి చట్టాలు, తుపాకుల చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంగ్రామం, వాతావరణ మార్పులు వంటి కీలకాంశాలను విస్మరిస్తూ ఇద్దరు నేతల వ్యక్తిగత వ్యవహారాల చుట్టూ సాగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానీకం ఏమాత్రం పరిణతి కనబరుస్తుంది, తీర్పు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమైంది.

Biden Vs Trump US Presidential Debate 2024
యూఎస్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​(ఎడమ), అధ్యక్షుడు జో బైడెన్(కుడి) (AssociatedPress)

రాజకీయాన్ని మార్చేసిన 'రాత్రి'
2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రైమరీలుగా పిలిచే రాష్ట్రాలవారీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెలలోనే రిపబ్లికన్ పార్టీ, ఆగస్టులో డెమొక్రటిక్ పార్టీ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించి అధ్యక్ష అభ్యర్థులు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో జో బైడెన్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. అధికార పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సంకేతాలిస్తూ నిరుద్యోగం రేటు భారీగా తగ్గడం, అబార్షన్లు వంటి వివాదాస్పద వ్యవహారాల్లో మెజారిటీ ప్రజల అనుకూల వైఖరి, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్​ను కేసులు చుట్టుముట్టడం వంటి సానుకూలతల మధ్య డెమొక్రాట్లు విజయం తథ్యమని విశ్వసించారు. కానీ, ఒకేఒక్క 'గురువారం' ఈ నమ్మకాల కోటను కూల్చేసింది. అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది.

2024 జూన్​ 27, గురువారం, అట్లాంటా వేదికగా ముఖాముఖి తలపడ్డారు ఇరు పార్టీ అధ్యక్ష అభ్యర్థులు. ఆ రాత్రి జరిగిన చారిత్రక చర్చ, విజయతీరాలవైపు సాగాలని ఆశించిన డెమొక్రాట్లను కష్టాల సుడిలోకి నెట్టేసింది. అందుకు కారణం బైడెన్ తడబాటు. ట్రంప్​తో వాగ్యుద్ధంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు ప్రస్తుత అధ్యక్షుడు. సూటిగా మాట్లాడుతూ, గణాంకాలు ఉదహరిస్తూ ట్రంప్ పూర్తి విశ్వాసాన్ని కనబరిస్తే బైడెన్​ తీరు అందుకు భిన్నం. తడబాటుకు గురవడం, అసంబద్ధంగా ఆగిపోవడం అనేక విమర్శలకు తావిచ్చింది. బైడెన్ కొంతకాలంగా మతిమరుపుతో బాధపడుతున్నారని, 81ఏళ్ల వయసులో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కష్టమని ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనలకు ఒక్కసారిగా కొండంత బలం చేకూరింది. అదే సమయంలో, బైడెన్​ మానసిక స్థితికి సంబంధించి అనేక వార్తలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పనితీరు బాగానే ఉన్నా, మిగిలిన సమయాల్లో ఇలానే కాస్త ఇబ్బందికర రీతిలో పనిచేసేవారని శ్వేతసౌధం అంతరంగికులు కొందరు ఉప్పందించారంటూ అమెరికాలోని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

డిబేట్​ సందర్భంగా సీఎన్​ఎన్​ స్టూడియోలో బైడెన్ (AssociatedPress)

పోలింగ్​కు 4 నెలల ముందు జరిగిన బైడెన్-ట్రంప్ ముఖాముఖి, డెమొక్రాట్లలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని మరొకరి అవకాశమిస్తే తప్ప పార్టీ గట్టెక్కడం కష్టమనే వాదనలు ఊపందుకున్నాయి. కీలక నేతల్లో అతికొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని బాహాటంగా చెబుతుండగా మిగిలిన వారంతా నష్టనివారణకు అష్టకష్టాలు పడుతున్నారు. రేసు నుంచి బైడెన్​ను తప్పించలేని పరిస్థితుల మధ్య కింకర్తవ్యం అంటూ తలలు పట్టుకుంటున్నారు. బయటకు మాత్రం అంతా బాగుందనే సంకేతాలిచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కరాత్రి అధ్యక్షుడు తడబడినంత మాత్రాన ఏమీ కాదని, గత నాలుగేళ్లలో ఆయన పనితీరును చూడాలంటూ బైడెన్​కు అండగా నిలిచేందుకు యత్నిస్తున్నారు.

ఈ పరిణామంతో బైడెన్​ వ్యక్తిగతంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ట్రంప్​తో ముఖాముఖికి ముందు విదేశీ పర్యటనలకు వెళ్లి, అలసిపోవడమే ఇందుకు కారణమంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్వేతసౌధం ప్రతినిధులూ ఇదే పాట పాడారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినందున కాస్త వైఖరి మార్చారు. 'అధ్యక్ష అభ్యర్థిని నేనే, యుద్ధం చేసేది నేనే, పార్టీని విజయతీరాలకు చేర్చేది నేనే' అంటూ దూకుడు వ్యాఖ్యలతో డెమొక్రాట్లలో భరోసా నింపేందుకు బైడెన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

పడిలేచిన కెరటం 'ట్రంప్'
డొనాల్డ్ ట్రంప్ కథ ఇందుకు పూర్తి భిన్నం. సొంత పార్టీలో సుస్థిరాధిపత్యం ఉన్నా, రాజకీయంగా కొంతకాలం క్రితం వరకు ఆయనది తీవ్ర ఇబ్బందికర పరిస్థితి. మాజీ అధ్యక్షుడి మెడపై కేసుల కత్తి వేలాడడమే ఇందుకు కారణం. శృంగార తార స్టోమీ డేనియల్స్​తో లైంగిక సంబంధం గురించి బయటకు రాకుండా చూసేందుకు ఆమెకు రహస్య చెల్లింపులు జరిపారన్న కేసులో ట్రంప్ దోషిగా తేలారు. షెడ్యూల్ ప్రకారం న్యూయార్క్ కోర్టు జులై 11న శిక్ష ఖరారు చేస్తే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే, ఇంతకన్నా పెద్ద కేసులో జులై 1న అమెరికా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడం వల్ల ట్రంప్ నెత్తిన పాలుపోసినట్టైంది. నేరాభియోగాల విచారణ నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఫలితంగా, 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు ట్రంప్ యత్నించారన్న అభియోగాలపై ఇప్పట్లో విచారణకు అవకాశం లేకుండా పోవడం రిపబ్లికన్ పార్టీకి ఊరట కలిగించింది. ఈ తీర్పు ఆధారంగా స్టోమీ డేనియల్స్ కేసులోనూ శిక్ష ఖరారు వాయిదా పడడం, ట్రంప్ వర్గంలో నవోత్సాహం నింపింది.

డోనాల్డ్​ ట్రంప్​ (AssociatedPress)

ట్రంప్​ వైపు జనం- కమలకు అవకాశం?
బైడెన్​తో ముఖాముఖి తర్వాత ట్రంప్​ పట్ల ప్రజాదరణ పెరుగుతున్నట్లు వేర్వేరు సర్వేల ద్వారా తేలింది. సంవాదానికి రెండు రోజుల తర్వాత ద వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో 48% మంది ఓటర్లు ట్రంప్​నకు జైకొడితే, 42% మంది బైడెన్​కు మద్దతు పలికారు. 2021 చివర్లో ఇదే సంస్థ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో వీరి మధ్య వ్యత్యాసం 2 శాతమే. రెండోసారి అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు బైడెన్ వయసురీత్యా ఏమాత్రం సరైన వ్యక్తి కాదని తాజా సర్వేలో ఏకంగా 80% మంది అభిప్రాయపడడం మరో కీలకాంశం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలకు సూచికగా నిలిచే విరాళాల సేకరణలోనూ ట్రంప్​దే ముందంజ. 2024 రెండో త్రైమాసికంలో రిపబ్లికన్ అభ్యర్థి 331 మిలియన్ డాలర్లు సమీకరిస్తే, బైడెన్ ​వాటా 264 మిలియన్ డాలర్లు మాత్రమే.

ఇలాంటి మరికొన్ని సర్వేలు, ప్రత్యర్థుల విమర్శల మధ్య అధ్యక్ష అభ్యర్థి మార్పుపై డెమొక్రాట్లలో విస్తృత చర్చ జరుగుతోంది. బైడెన్​కు బదులుగా కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నూజమ్ లేదా మిషిగన్ గవర్నర్ గ్రెచ్చెన్ విట్మర్ లేదా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) బరిలోకి దిగడంపై రకరకాలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత సంతతి మహిళ అయిన కమల ఇప్పటికే అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే, ఆమె అధ్యక్ష అభ్యర్థిత్వ అవకాశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమల పోటీ చేస్తేనే డెమొక్రటిక్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువని సీఎన్​ఎన్​ సర్వేలో తేలింది. ట్రంప్, బైడెన్ మధ్య ఓట్ల వ్యత్యాసం 6% కాగా, కమల పోటీ చేస్తే అది 2శాతానికి తగ్గనుంది! మహిళలు, తటస్థుల మద్దతు కమలకు దక్కడమే ఇందుకు కారణం. అయితే, అధ్యక్ష అభ్యర్థిగా కమలను ఒప్పుకునే పరిస్థితులు చాలా తక్కువని ద వాల్​ స్ట్రీట్ జర్నల్ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 35% మంది మాత్రమే ఆమెకు మద్దతు పలకగా, 58% మంది వ్యతిరేకించారు. ఇలాంటి సంక్లిష్టతల మధ్య డెమొక్రటిక్ పార్టీ ఏం చేస్తుంది? బైడెన్​ సారథ్యంలోనే ముందుకెళ్తే అమెరికా ఓటరుగణం ఎలాంటి తీర్పు ఇస్తుంది? 2025 జనవరిలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ప్రపంచగతిని ఎలా ప్రభావితం చేస్తుందనేది సశేషం!

--జీఎస్​ఎన్​ చౌదరి.

'మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుంది'- ట్రంప్​నకు కోర్టులో భారీ ఊరట

బైడెన్​ ప్లేస్​లో మరొకరు! తప్పుకోవాలని పెరుగుతున్న డిమాండ్లు- క్లారిటీ ఇచ్చిన డెమోక్రాటిక్ పార్టీ - US Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.