"స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి మా పత్రిక కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం" అని భారతావనిలోని దినపత్రికలు నేడు ప్రకటనలు ఇస్తాయి. కారణం ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవం. చాలా పత్రికలకు ఇది ప్రకటన కావచ్చు కానీ, ఈనాడుకు మాత్రం ప్రాణసమానం. 1966 నవంబరు 16న ప్రెస్ కౌన్సిల్ ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిఏటా ఆ రోజున జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుతున్నారు. అప్పటికి 30 ఏళ్ల క్రితం అదే నెల అదే రోజు (1936 నవంబరు 16) కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో "ఈనాడు" వ్యవస్థాపకుడు రామోజీరావు జన్మించారు. మీడియాలో ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మాటకొస్తే ఆయన పాత్ర మీడియాకే పరిమితం కాలేదు. ఫైనాన్స్, సినిమా నిర్మాణం, స్టూడియో నిర్వహణ, ఆహార పరిశ్రమ, పర్యటకం, హోటళ్లు, హస్తకళలు, వస్త్రాలు, విద్య.. తదితర రంగాల ద్వారా ఇప్పటి వరకు లక్షల మందికి ఉపాధి కల్పించారు. ప్రభుత్వాలకు పన్నులూ, సుంకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చారు. ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. రామోజీరావు లాంటి సంపద, ఉపాధి సృష్టికర్తలు నేడు దేశానికి ఎంతో అవసరం.
రామోజీరావు సాహసికుడు. పెద్దపెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు అసాధారణ ధైర్యం కనపరిచే వారే సఫలీకృతులు కాగలరనే మాటలు ఆయన జీవితంలో అక్షర సత్యాలు. ఈ ప్రపంచాన్ని మార్చాలన్న "మొండి పట్టుదల" ఎవరికి ఉంటుందో వారే దాన్ని సాధించగలరని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఆయనకు వంద శాతం వర్తిస్తాయి. ఎవరూ చేయలేని పనిని చేసినప్పుడే తనకు థ్రిల్ ఉంటుందని రామోజీరావు జీవితాంతం అనేవారు.
సంకల్ప బలం... అనితర సాధ్యం
విశాఖపట్నంలో ఒక తెలుగు దినపత్రికను ప్రారంభించడం, నాలుగేళ్లలోపే నంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దడం, ఒకేసారి 26 జిల్లా పత్రికల్ని ప్రవేశపెట్టడం, 1983లో అసాధారణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం, 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం కూల్చివేసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఊపిరిపోయడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫిల్మ్‌సిటీని నిర్మించడం, భారతీయ భాషలన్నిటిలో ఈటీవీ-ఈటీవీ భారత్ ఛానళ్లను నెలకొల్పడం, 2006లో, 2022లో ఈనాడును దుంపనాశనం చేయాలన్న ప్రభుత్వాల కుట్రను తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి ఛేదించడం వంటివన్నీ రామోజీరావు జీవితంలో సాహసాలే. సంకల్పం ఉంటే ఎదగడానికి ఆకాశమే హద్దు అనేది ఆయన నమ్మకం. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, అధికార కేంద్రాలకు ఎంత దగ్గరగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఎలాంటి ప్రభావాలకూ ప్రలోభాలకూ లోనుకాని వ్యక్తిత్వం ఆయనది.
అందరూ చూసే అంశాన్నే భిన్నంగా చూడటం, విభిన్నంగా ఆలోచించడం రామోజీరావు విలక్షణత. ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ కొత్త పుంతలు తొక్కారు. భవిష్యత్తును ఉహించగలిగిన దక్షత ఆయన సొంతం. 88 ఏళ్ల వయసులోనూ ఆలోచనలు ఆధునికమే. శారీరకంగా బలహీనపడినప్పుడు కూడా మెదడు పాదరసంలా పనిచేస్తూనే ఉంది. అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఆయన ఆలోచనల పరుగు ఆగలేదు.
ప్రజాక్షేమమే పరమావధి
స్వతహాగా నాస్తికుడైన రామోజీరావుకు ప్రజలే దేవుళ్లు. ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ప్రజల కోణంలోనే ఆలోచించేవారు. ప్రజల ప్రయోజనం ముందు వ్యక్తుల ప్రయోజనం తక్కువ. ఈ రెండింటికీ తేడా వస్తే ఆయన ప్రాధాన్యం ఎప్పుడూ ప్రజల వైపే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు, అపహాస్యం పాలైనప్పుడు ఆయన ఉగ్రరూపం దాల్చి తన మీడియాను ప్రజల చేతుల్లో అస్త్రంగా మలిచారు. పాఠకాదరణ ఉంది కదాని వృత్తి నిబద్ధతను వీడలేదు. విశ్వసనీయతను ప్రాణసమానంగా కాపాడుకున్నారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఆయన అండగా నిలిచారు. "ఈనాడు" ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న తొలిరోజుల్లో కూడా అంతే. "ఈనాడు సహాయ నిధి" ద్వారా నలభై ఏళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా దాదాపు రూ.100 కోట్లు ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టారు. ఆయన అనంతరం కూడా రామోజీ గ్రూపు సంస్థలు ఈ వితరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాయి.
రామోజీరావుది స్వాభావికంగా జాతీయ దృక్పథమైనా తెలుగు ప్రజలన్నా, తెలుగు భాషన్నా ప్రాణం. తెలుగు జాతి ఉనికి తెలుగు భాషతోనే ఉందన్నది ఆయన నమ్మకం. తెలుగు మీద ప్రేమతోనే చతుర, విపుల, తెలుగు వెలుగు, బాలభారతం లాంటి వినూత్న పత్రికల్ని స్థాపించారు. పత్రికల, సంస్థల పేర్లన్నీ కూడా అచ్చమైన తెలుగులోనే పెట్టారు.
రామోజీరావు తన జీవితకాలంలోనే గ్రూపు సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చారు. ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో రాణించేందుకు జీవితం అనే కొవ్వొత్తిని ఆయన రెండువైపులా వెలిగించారు. రోజుకు కనీసం 14-16 గంటల చొప్పున జీవితాంతం పనిచేశారు. దినపత్రిక నిర్వహణ అసిధారావ్రతం. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని వనరులూ అవకాశాలూ ఉన్నా ఆయన ఎక్కువ దేశాలూ ప్రదేశాలూ చూడలేదు. ‘నా విజయ రహస్యమేమైనా ఉందీ అంటే అది, పని.. పని.. పని.. కష్టపడి పనిచేయడమొక్కటే. విశ్రాంతి కూడా నాకు పని చేయడంలోనే లభిస్తుంది. విజయానికి దగ్గరి దారులు ఉండవు’ అని ఎప్పుడూ చెప్పేవారు.
తాను జీవించి ఉండగానే ప్రత్యామ్నాయం చూపగలిగినవారే నిజమైన నాయకులని రామోజీరావు నమ్మకం. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ఆయనకు ప్రత్యామ్నాయం అన్నది అసాధ్యమే అయినా, తాను ఉండగానే రామోజీ గ్రూపు సంస్థలకు నాయకత్వ పరంపరను ఏర్పాటుచేశారు. అందుకే రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎలాంటి తొట్రుపాటు లేకుండా నడుస్తున్నాయి. ఆయన పెద్ద మనవరాలు సహరి ఆధ్వర్యంలో ప్రియా ఫుడ్స్ నేడు కొత్త అడుగులు వేస్తోంది. చిరుధాన్యాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తయారు చేయాలనేది రామోజీరావు కల. ఆయన పుట్టిన రోజు నాడు తన మనవరాలు దాన్ని సాకారం చేస్తున్నారు. "నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగు జాతి తలలో నాల్కలా కొనసాగాలన్నదే నా ఆశ, ఆకాంక్ష" అన్న ఆయన కోరిక నెరవేరుతోంది.
"అధికార మార్పిడి అంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావడం కాదు. అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చినవారు విచారణ చేసి అవినీతిపరుల్ని శిక్షించడంతో పాటు దిగమింగిన ప్రజల సొమ్మును కక్కించాలి" అని రామోజీరావు బలంగా చెప్పేవారు. అలా చేయకపోవడమంటే, ప్రజల్ని మభ్యపెట్టడమే ఆయన దృష్టిలో.
ఆయన జీవితమే ఒక పాఠ్యపుస్తకం
రామోజీరావులోని అంకితభావం, ధైర్యం, ప్రతికూలతల్ని తట్టుకోగల సామర్థ్యం అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయసోపానాలుగా, వైఫల్యాలను గెలుపు పునాదులుగా ఎలా మలచుకోవచ్చో ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు. తెలుగు జాతికి రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాత.
అస్తమించే సూర్యుడు వేకువను హామీ ఇచ్చినట్లు,
ఓ మహా స్వాప్నికుడా మళ్లీ జన్మించు..
వెలుగు బాటలో మమ్మల్ని నడిపించు!