సిరియాలో దశాబ్దాల బషర్ అల్ అసద్‌పాలనకు తెర
సిరియా కెమికల్ వెపన్స్‌పై, క్షిపణులపై ఇజ్రాయెల్ దాడులు
సిరియా సరిహద్దులో భారీగా ఇజ్రాయెల బలగాల మోహరింపు
మిడిల్ ఈస్ట్‌లో మరో యుద్ధం తప్పదా? ఇప్పటికే గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాతో భీకర పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు- సిరియా సంక్షోభం తలనొప్పిగా మారిందా? సిరియా రూపంలో ఇజ్రాయెల్‌కు మరో ముప్పు పొంచి ఉందా? సిరియాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందా? సిరియాలో ఇజ్రాయెల్ సైనిక సన్నాహాలు దేనికి సంకేతం? మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత విస్తరిస్తుందా? ఇప్పటికే సిరియా బఫర్ జోన్లో పాగా వేసిన ఇజ్రాయెల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడం వల్ల తలెత్తే పర్యవసానాలు - మధ్య ప్రాశ్చ్యంలో ఏ పరిస్థితులకు దారితీస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ముప్పు, అవకాశం
సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడం వల్ల ఇజ్రాయెల్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ సమీపంలో హయత్ తహ్రీర్ అల్ షామ్ - హెచ్‌టీఎస్ వంటి సిరియా తిరుగుబాటు దళాలు పాగా వేశాయి. దీంతో రసాయన ఆయుధాలు, అధునాతన ఆయుధాలు శత్రు చేతుల్లోకి చేరడం వల్ల ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. దీంతో తమకు ముప్పు పొంచి ఉంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఈ ముప్పుతో పాటు సిరియా సంక్షోభం ఇజ్రాయెల్‌కు మరో అవకాశాన్ని అందించింది. ఇరాన్ మద్దతుతో సిరియాలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అసద్ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మరో అవకాశం లభించినట్లు అయింది. సిరియా ద్వారా లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌నకు ఇరాన్ చేసే అయుధాల స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
సిరియా బఫర్ జోన్‌పై ఇజ్రాయెల్ కన్ను!
సిరియా నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన ఇజ్రాయెల్ డిఫెన్సివ్ చర్యలకు ఉపక్రమించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉన్న డీ-మిలిటరైజ్డ్ బఫర్ జోన్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బఫర్ జోన్‌లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమ దళాలు బయలుదేరాయని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఆదివారం గోలన్ హైట్స్‌లో పర్యటించిన నెతన్యాహు, సిరియా భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని విచిడిపెట్టాయని, అందుకే బఫర్ జోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. అయితే ఇది తాత్కాలిక డిఫెన్సివ్ పొజిషన్ మాత్రమే అని, తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు.
ఇక, తమ సరిహద్దుకు సమీపంలోని కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి గిడెన్ సార్ తెలిపారు. అక్టోబర్ 7 పరిస్థితి పునరావృతం కాకూడదనే ఇలా చేసినట్లు తెలిపారు.
అయితే, ఇజ్రాయెల్ చర్యలను ఈజిప్టు విదేశాంగ శాఖ ఖండించింది. సిరియాలో అధికార శూన్యతను ఆసరాగా తీసుకుని ఆ దేశంలో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించాలని ఇజ్రాయెల్ చూస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇజ్రాయెల్ చర్యలపై విమర్శకుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరియాలోని ఆందోళనకర పరిస్థితులను అనుకూలంగా చేసుకుని, ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. సీజ్ఫైర్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఆక్రమణ చేయాలని ఇజ్రాయెల్ యోచిస్తోందని ఆరోపణలు గుప్పించారు విమర్శకులు.
సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్న గోలన్ హైట్స్‌ను 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్ హైట్స్‌ను అమెరికాతో పాటు అతి తక్కువ దేశాల మాత్రమే గుర్తించాయి. 1973లో సిరియా, గోలన్ హైట్స్ మధ్య ఐరాస బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి ప్రాంతంలో ఐరాస బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ చర్యల వల్ల- బఫర్ జోన్లో ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు చేపట్టరాదన్ని 1974 సీజ్ఫైర్ ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుందని ఐరాస దళాలు ఇజ్రాయెల్‌కు చెప్పాయి. అయితే ఇప్పిటివరకు బఫర్ జోన్ ప్రశాంతంగా ఉందని, ఐరాస దళాలు తమ పొజిషన్లోనే ఉన్నాయని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.
అయితే బఫర్ జోన్లోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకుపోవడం ఇదేం మొదటిసారి కాదు. ఓ కొత్త రోడ్డు నిర్మాణంలో భాగంగా బఫర్ జోన్లోకి ఇజ్రాయెల్ వెళ్లిందని ఓ అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ నివేదికలో తెలిపింది. దీంతో ఐరాస దళాలు ఇజ్రాయెల్‌ను హెచ్చరించాయి. టెల్ అవీస్- సిరియా సీజ్ఫైర్ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని చెప్పాయి.
ఇజ్రాయెల్ సిరియాను ఆక్రమిస్తుందా?
బఫర్ జోన్‌ను ఆధీనంలోకి తీసుకోవడం తాత్కాలిక చర్య మాత్రమే అని, సిరియాలోని మిగతా ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి కాదని ఇజ్రాయెల్ రాజకీయ, మిలిటరీ లీడర్లు పదే పదే చెబుతున్నారు. సరిహద్దు వద్ద స్థిరత్వం ఉండాలనే ఇలా చేశాం అంటున్నారు. ఐరాస దళాలు అక్కడే ఉండొచ్చని ఓ ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి చెప్పారు. 2014లో అల్ ఖైదా మద్దతున్న సిరియా రెబెల్స్- ఐరాస దళాలపై దాడి చేశారని దీంతో ఐరాస దళాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఇజ్రాయెల్ అనుకుంటోందని వెల్లడించారు.
ఇజ్రాయెల్- సరిహద్దును మార్చాలని లేదా సిరియాను ఆక్రమించాలని అనుకోవడం లేదని టెల్ అవీవ్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ రీసెర్చర్ కార్మిట్ వలెన్సీ తెలిపారు. ఇది వ్యూహాత్మక ఆపరేషన్ మాత్రమే అని అన్నారు. సిరియన్ ఆర్మీ కుప్పకూలిపోవడం వల్ల తమ సరిహద్దులను ఇజ్రాయెల్ కాపాడుకోవాలనుకుంటోందని చెప్పారు.
అసలు ఇజ్రాయెల్‌కు కావల్సిందేంటి?
సిరియాలో నెలకొన్న సంక్షోభం ఆ ప్రాంతం(మిడిల్ ఈస్ట్)లో వ్యాపించకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యం అని ఇజ్రాయెల్ చెబుతోంది. సిరియా ఆక్రమణ వార్తలను ఖండించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, బఫర్ జోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాక, దానికి మించిన సెక్యూరిటీ జోన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సిరియావ్యాప్తంగా ఉన్న భారీ ఆయుధాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ జోన్ క్రియేట్ చేస్తామన్నారు. తద్వారా సిరియా మీదుగా లెబనాన్‌కు ఇరాన్ చేసే ఆయుధాల స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామన్నారు.
ఈ క్రమంలోనే సిరియాలో ఉన్న కెమికల్ వెపన్స్, దీర్ఘ శ్రేణి క్షిపణులపై ఇజ్రాయెల్ దాడి చేసింది. శత్రువుల చేతుల్లో అవి వెళ్లకుండా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సిరియా రెబల్స్‌తో మాట్లాడేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు!
సిరియాలో నివసించే డ్రూజ్ అనే మైనార్టీలకు దగ్గర కావడానికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. సిరియాతో పాటు ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ఈ వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తారు. అంతేకాకుండా ఇరాన్ మద్దుతున్న తిరుగుబాటు దళాలు, మళ్లీ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా, సిరియా తిరుగుబాటు దళాలతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా ఇజ్రాయెల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
సంక్షోభంలో ఉన్న సిరియా ప్రజలకు ఇజ్రాయెల్ సవంత్సరాలుగా ఆహారం, మెడిసిన్, దుస్తులు తదితర వస్తువులను అందించింది. ఆపరేషన్ గుడ్ నైబర్ కింద ఈ సహాయం చేసింది. కాగా, ఈ ఆపరేషన్ 2018లో ఆగిపోయింది. అంతేకాకుండా, దాదాపు 4000 మంది క్షతగాత్రులు, అనారోగ్యంగా ఉన్నవారు ఇజ్రాయెల్ లేదా ఇజ్రాయెల్ ఫీల్డ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇన్ని సంవత్సరాలు నెరిపిన ఇలాంటి నాన్-డిప్లొమాటిక్ సంబంధాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు కీలకంగా మారాయి.