Acharya Satyendra Das Death : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఫిబ్రవరి 3న లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్లే ఆయన పరిస్థితి విషమించిందని, వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించి, రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.