Tamilnadu Style Veg Kuska Recipe :బిర్యానీ.. ఈ పేరు చెప్పగానే చాలా మంది భోజన ప్రియుల నోట్లో నీళ్లూరతాయి. అలాంటి ఫుడ్ లవర్స్ కోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "తమిళనాడు స్టైల్ వెజ్ కుష్కా" రెసిపీ. ఇది చూడ్డానికి బిర్యానీలాఉంటుంది. కానీ.. దీన్లో చికెన్, మటన్ వంటి వాటిని వాడము. అలాగే, ఎలాంటి కూరగాయలు అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలతో దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - ఒకటిన్నర గ్లాసు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- బిర్యానీ ఆకులు - 2
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 1 రెమ్మ
- జీడిపప్పు పలుకులు - 2 టేబుల్‌స్పూన్లు
- ఫ్రైడ్ ఆనియన్స్ - 2 నుంచి 3 టేబుల్‌స్పూన్లు
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - అరటీస్పూన్
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- బిర్యానీ మసాలా పౌడర్ - అరటీస్పూన్
- పచ్చి బఠాణీ - 3 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నెయ్యి - 1 టీస్పూన్
మసాలా పేస్ట్ కోసం :
- నూనె - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- లవంగాలు - 4
- యాలకులు - 2
- సన్నని అల్లం ముక్కలు - కొన్ని
- వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 15
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - పావు ముక్క
- టమాటాలు - 2
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పుదీనా తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పెరుగు - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
- నూనె కాస్త వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, సన్నని అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అవన్నీ దోరగా వేగిన తర్వాత అందులో కాస్త పెద్ద సైజ్‌లో తరుక్కున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి టమాటాలు సాఫ్ట్‌గా మారే వరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని కలిపి పాన్ని దింపుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న టమాటా మిశ్రమం, పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
- నూనె వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచం దోరగా వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా పొడి వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని అందులో వేసుకొని కలిపి మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక.. నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వాటర్ లేకుండా వడకట్టుకొని ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే, పచ్చిబఠాణీని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఎసరు కోసం మరిగించుకున్న వాటర్‌ని రెండున్నర గ్లాసుల వరకు పోసుకొని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి.
- ఇక్కడ మీరు రైస్‌ను ఏ గ్లాసుతో తీసుకున్నారో అదే కొలతతో వాటర్‌ని తీసుకోవాలి. అలాగే నార్మల్ రైస్ తీసుకుంటే మూడు గ్లాసుల వరకు వాటర్‌ని పోసుకోవాలి.
- ఇక రైస్ కొంచం ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు మూత తీసి కొత్తిమీరతరుగు, నెయ్యి వేసుకొని మొత్తాన్ని మరోసారి కలిపి మూతపెట్టుకొని వాటర్ పూర్తిగా ఇగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక దింపుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా రైస్" రెడీ!
ఇవీ చదవండి :
మీ పిల్లలు కరివేపాకు తినడం లేదా? - ఇలా రైస్ చేసి పెడితే మెతుకు మిగల్చరు - పైగా ఆరోగ్యం కూడా!
పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ "ఆమ్లా రైస్" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు!