Tips to Tasty Fish Fry Making : సండే వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో నాన్‌వెజ్ వంటకాలు ఘుమఘుమలాడాల్సిందే. ఈ క్రమంలో ఎక్కువ మంది గుడ్డు, చికెన్, మటన్ వంటి వాటికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారు. కానీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపలను తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ముఖ్యంగా చికెన్, మటన్ వండినంత బాగా చేపలు వండడం రాదని చాలా మంది వాటిని అంతగా తీసుకోరు.
ఒకవేళ కొందరు ఇష్టంతో చేపలు తెచ్చుకున్నా కర్రీ, పులుసు కంటే త్వరగా అవుతుందని ఫ్రై చేసుకుంటుంటారు. కానీ, పర్ఫెక్ట్ టేస్ట్ రావడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. ఈ సండే వాటిని ఫాలో అవుతూ "చేపల ఫ్రై" ట్రై చేయండి. హోటల్, రెస్టారెంట్ రుచికి ఏమాత్రం తీసిపోదు! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్గా కుదరాలంటే ముందుగా పాలలో 20 నిమిషాలు చేప ముక్కలను నానబెట్టి, తర్వాత పాలు తీసేయాలి. ఇలా చేయడం ద్వారా నీచు వాసన తగ్గడమే కాకుండా అదనపు టేస్ట్ వస్తుంది.
- అలాగే చేప ముక్కలకు మసాలా పట్టించేటప్పుడు కొద్దిగా బియ్యప్పిండి లేదా శనగపిండిని యాడ్ చేస్త్ ఫ్రై కరకరలాడుతుంది.
- చేపల ఫ్రై కోసం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు అందులో వాటర్ పోయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఉల్లిపాయల్లో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి మసాలా పేస్ట్‌ను గ్రైండ్ చేసేందుకు వాటర్ అవసరం లేదు. అందుకు బదులు చెంచా నిమ్మరసం వాడుకోవచ్చు.
సండే స్పెషల్ : అద్దిరిపోయే బెంగాలీ స్టైల్ "చేపల పులుసు"- ఈ విధంగా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!
- ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు యాడ్ చేసుకొని ముద్దలా చేయాలి. ఆపై దీన్ని చేపముక్కలకి పట్టించి 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- చాలా మంది ఫిష్ ఫ్రై మొత్తం చేపను అలాగే ఉంచి చేస్తుంటారు. కానీ, అలాకాకుండా చేపలను ముక్కలుగా కోసి చేస్తేనే బాగుంటుంది. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు.
- అదేవిధంగా.. ఆయిల్ మరీ వేడిగా ఉన్నా నానబెట్టిన చేప ముక్కలు పాత్రకు అంటుకుంటాయి. కాబట్టి చేపల ఫ్రై చేసుకునేటప్పుడు తగినంత సెగలో వేయించుకోవాలి.
- ఒకవేళ ఎక్కువ మోతాదులో చేపల ఫ్రై చేయాల్సివస్తే అన్నీ ఒకసారే వద్దు. కొన్ని కొన్ని ముక్కల చొప్పున వేయించండి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ముక్కలు వేస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. పైగా ముక్కలు సరిగా వేగవని గుర్తుంచుకోవాలి.
- రెండు వైపులా చేపముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. వహ్వా అనిపించే టేస్ట్ రావాలంటే పావుగంట పడుతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సండే ఇలా చేపల ఫ్రై చేసుకోండి. ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి!
నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ కేక అంతే!