Cave Discovered While Digging Soil In YSR District : ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో రోడ్డు కోసం కొండ మట్టిని తవ్వుతుండగా ఓ భారీ గుహ బయటపడింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలంతా గుహను చూడటానికి తరలివచ్చారు. గుహ లోపల ఎంత లోతు ఉందో తెలియట్లేదని స్థానికులు అంటున్నారు. దీంతో గుహలోకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయటం లేదు.
శివాలయం సమీపంలోని కొండలో గుహ : వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం ముచ్చుమర్రి గ్రామ శివాలయం దగ్గరలోని కొండలో గుహ బయటపడింది. రహదారి కోసం పొక్లెయిన్లతో మట్టి తవ్వుతుండగా ఈ గుహ బయటపడిందని అక్కడి గ్రామస్థులు తెలిపారు. ఇది చాలా పొడవుగా, పెద్దగా ఉండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అక్కడి ప్రజలు ఈ గుహ ఉన్నచోట శుభ్రం చేశారు. గుహలోకి రాయి విసిరితే లోపలికి వెళుతున్నాయని తెలుపుతున్నారు. దీంతో గుహ ఎంత వరకు ఉందో తెలియడం లేదన్నారు.
గుహ లోపలికి వెళ్లాలంటే మట్టి పెళ్లలు పడతాయన్న భయంతో ఎవ్వరూ లోపలికి వెళ్లడం లేదు. ఈ గుహను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు తరలివస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన గుహ శివాలయానికి దగ్గరలో ఉండటంతో ఈ గుహలో ఈశ్వరుడిని ప్రతిష్ఠించాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.