Joe Root Break Sachin Record : ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు, ఈ రికార్డు సచిన్ తెందూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉండేది. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ 23 పరుగులు చేసి ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్
కాగా, టీమ్ఇండియా మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన జోరూట్ 12,777 రన్స్ బాదాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్స్
- జో రూట్ - 1630 (49 ఇన్నింగ్స్)
- సచిన్- 1625 (60 ఇన్నింగ్స్)
- అలిస్టర్ కుక్ - 1611 (53 ఇన్నింగ్స్)
- గ్రేమ్ స్మిత్ - 1611 (41 ఇన్నింగ్స్)
- శివనారాయణ్ చందర్ పాల్ - 1580 (49 ఇన్నింగ్స్)
చెత్త రికార్డు కూడా!
అయితే కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్, మరో చెత్త ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. దీంతో 150వ టెస్టులో డకౌట్ అయిన ముూడో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఆసీస్ దిగ్గజాలు స్టీవ్ వా (2002లో పాకిస్థాన్‌పై), రికీ పాంటింగ్ (2010లో ఇంగ్లాండ్ పై) తమ 150వ టెస్టులో గోల్డెన్ డకౌటయ్యారు.
ఇంగ్లాండ్ విజయం
కాగా, కివీస్ తో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్, 254 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ సునాయాశంగా ఛేదించింది.