Avoid These Beauty Products for Skincare : అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. చలికాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ సౌందర్యం దెబ్బతినకుండా చాలా మంది మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మరికొందరు ఇంటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు వాడే సౌందర్య ఉత్పత్తుల్లో ముఖానికి వాడకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయంటున్నారు. అది తెలియక చాలా మంది తమ ముఖ సౌందర్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇంతకీ, అందాన్ని సంరక్షించుకునే క్రమంలో ముఖానికి వాడకూడదని ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాడీ లోషన్ : చాలా మందికి చర్మం పాలిపోకుండా బాడీ లోషన్ ఉపయోగించే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది దీన్ని ముఖానికీ యూజ్ చేస్తుంటారు. కానీ, అలా చేయకపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే బాడీ లోషన్లో జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి.. క్రమంగా మొటిమలు రావడానికి కారణమవుతుంది. అంతేకాదు దానిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి దారితీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులు.. అది కూడా పారాబెన్ వంటి కెమికల్ లేనివి ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని కొనేముందు ఓసారి లేబుల్ చెక్ చేయడం మర్చిపోవద్దంటున్నారు.
నిమ్మతోనూ సమస్యలు! : నేచురల్‌గా ప్రిపేర్ చేసుకునే స్క్రబ్స్, ఫేస్‌ప్యాక్స్.. వంటి వాటిలో నిమ్మను వాడడం సాధారణమే. కానీ, కొంతమంది నిమ్మచెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటుంటారు. వీలైనంత వరకు నిమ్మను డైరెక్ట్‌గా ఫేస్‌కి వాడకపోవడం బెటర్. ఎందుకంటే నిమ్మలోని కొన్ని సమ్మేళనాలు కొందరిలో ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతాయి. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు స్కిన్ ఇరిటేషన్‌కి గురై దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి నిమ్మకు బదులుగా బంగాళాదుంప, టమాటా.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు.
టూత్‌పేస్ట్ వద్దు! : చాలామంది మొటిమలు ఉన్న చోట టూత్‌పేస్ట్ రాయమని సలహా ఇస్తుంటారు. కానీ, అలా చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే పేస్ట్ అప్లై చేసిన చోట చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా కొందరిలో ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు, రంగు మారడం.. వంటి సమస్యలొచ్చే ఛాన్స్ ఉంటుందట. అదేవిధంగా దానిలోని గాఢమైన పదార్థాల వల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కూడా రావచ్చట!
వ్యాక్స్ చేస్తున్నారా?
ఎక్కువ మంది ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి వ్యాక్స్ చేసుకునే పద్ధతి అనుసరిస్తుంటారు. అందుకు అనుగుణంగానే మార్కెట్లో వ్యాక్స్ స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అయితే, వీటిని చర్మతత్వాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడం, ముడతలు పడడంతో పాటు స్కిన్ మరింత సున్నితంగా మారుతుంది. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు కందిపోవడం, ర్యాషెస్.. వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫేషియల్ వ్యాక్స్ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంట్లో తయారుచేసుకున్న వ్యాక్స్ అయినా.. బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్ అయినా.. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.
ఇవీ చదవండి :
మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ!
కొరియన్స్‌లా మీ స్కిన్ కూడా నిగనిగలాడాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు!