Telangana Weather Updates : రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా రెండు నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నట్లుగా చెప్పారు. గాలిలో అనిశ్చితి కారణంగా రాగల రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవ్వడంతో పాటు అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు.
గత వేసవి కంటే ఈ ఏడు అధిక ఉష్ణోగ్రతలు : గత పది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి రెండు నుంచి 5 డిగ్రీలు నమోదవుతున్నాయని శ్రీనివాస్ రావు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు ఇతర పరిస్థితుల వల్ల గత 20 ఏళ్ల నుంచి ఏటికేడు ఉష్ణోగ్రతలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉందని తెలిపారు. గాలి దిశల్లో మార్పులు రావడం వల్ల తేమ కూడా ప్రవేశించి ఉక్కపోతకు కారణమవుతుందని వివరించారు. గత వేసవి కంటే ఈ ఏడు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గిందని వాతావరణ అధికారి వివరించారు. ఉదయం నుంచి నాలుగు గంటల సమయంలో 15 డిగ్రీల నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొంచెం ఉక్కపోత ఉన్నట్లుగా అనిపిస్తుంది.
"గాలిలో అనిశ్చితి కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత 10-20 ఏళ్లుగా వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. గాలి గతుల్లో మార్పులు రావడంవల్ల వాతావరణంలోకి తేమ ప్రవేశించి ఉక్కపోతకు కారణమవుతుంది. అధికారిక వాతావరణ అంచనాలు ఈ నెలఖరు నాటికి ఐఎండీ విడుదల చేస్తుంది" - శ్రీనివాస్ రావు, వాతావరణశాఖ అధికారి
వచ్చే మూడు రోజులు సూరీడు సుర్రుమంటాడు - బయట తిరిగేవారు జాగ్రత్త!
IMD Alert : రాబోయే 3 రోజులు జాగ్రత్త - సూర్యుడి భగభగలు ఖాయం!