Turmeric Adulteration Test at Home :మన దేశంలో రోజురోజుకీ ఆహార కల్తీ ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతోంది. పసిపిల్లలు తాగే పాల నుంచి వంటింట్లో ఉపయోగించే మసాలాలు, కారం, నూనె ఇలా అన్నీ కల్తీ అవుతున్నాయి. నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో మార్కెట్లో నకిలీ పసుపు ప్రజల్ని కలవరం పెడుతోంది. వంటల్లో కల్తీ పసుపు వాడడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మీ కిచెన్లో ఉన్న పసుపు స్వచ్ఛమైందో లేదా ?నకిలీదోతెలుసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నీటిలో పసుపు వేస్తే..ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ).. కల్తీ పసుపుని గుర్తించడానికి ఓ చిన్న ప్రయోగంతో వీడియో రూపొందించింది. కల్తీ పసుపుని గుర్తించడానికి రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్ స్పూన్ చొప్పున పసుపు వేయండి. స్వచ్ఛమైనది అయితే.. లేత పసుపు రంగులోకి మారి వాటర్ అడుగుకు చేరుతుంది. కల్తీది గ్లాసులోని వాటర్ని చిక్కటి పసుపు రంగులోకి మార్చేస్తుంది. ఈ పరీక్ష ద్వారా మీరు సులభంగా నకిలీ పసుపుని గుర్తించవచ్చు.
పసుపు కొమ్ములు కూడా 'కల్తీ' మయం!కొంతమంది మార్కెట్లో దొరికే పసుపు ప్యాకెట్లను కొని ఉపయోగించకుండా.. పసుపు కొమ్ములు పట్టించి వాడుతుంటారు. అయితే, కొందరు పాడైపోయిన పసుపు కొమ్ములు మంచి రంగులో కనిపించడానికి.. వాటికి కలర్లు కలిపి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అందుకే పసుపు కొమ్ములు కొనేవారు కూడా నకలీవి కొని మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నకిలీ పసుపు కొమ్ములను గుర్తించడానికి కూడా ఓ చిన్న ప్రయోగంతో వీడియో రూపొందించింది.