kadiyam Srihari Fire on kcr family : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కల్వకుంట్ల కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంభకోణంలో దిల్లీలోని తీహార్ జైలులో ఎన్ని రోజులు ఉందో అందరికీ తెలిసునని చెప్పారు. రేపో, మాపో ఫార్ములా-ఈ కేసులో దాదాపు రూ.55 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడం వల్ల మాజీ మంత్రి కేటీఆర్ సైతం జైలుకు పోవడం కూడా ఖాయమన్నారు.
హరీశ్ రావు జైలుకే : జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తికాగానే కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో వీరు అనేక తప్పులు చేశారని అందువల్ల విచారణను ఎదుర్కొవల్సిందేనని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
"కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి. నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాల ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి. ఇన్ని రకాల సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి. మీరు మంచివాళ్లయితే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది. పదుల కోట్ల నుంచి వేల కోట్లు ఎలా వచ్చాయి. వందల ఎకరాల భూములు మీ చేతులోకి ఎలా వచ్చాయి". - కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
గ్రామస్థులతో ముఖాముఖి : కజనగామ జిల్లాలోని చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ''గ్రామస్థులతో ముఖాముఖి'' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దళిత బంధులో కమిషన్లు : కేసీఆర్ గత పదేళ్ల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరలేపారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి 2014 ముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని ఎమ్మెల్యే శ్రీహరి డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో కమిషన్ తీసుకున్న వారు కూడా నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కడియం శ్రీహరి తాను తప్పు చేస్తే ఆధారాలు చూపించాలని, ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని పరోక్షంగా స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి హెచ్చరించారు.