VIJAYAWADA BOOK FESTIVAL 2025 : పుస్తకాలు చదవడం అలవాటైతే గెలవడం ప్రారంభమవుతుందని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి 35వ పుస్తక మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసినటువంటి సభలో ఎం. నాగేశ్వరరావు ప్రసంగించారు. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం అత్యంత సముచితమని అభిప్రాయపడ్డారు. పుస్తకాలను, అక్షరాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి ఆయన అని నాగేశ్వరరావు కొనియాడారు. రామోజీరావు 50 ఏళ్లపాటు అక్షర తపస్సును చేశారని, ఆయన స్మృతిలో వేదికకు నామకరణం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
విజేతలందరికీ ఉన్న లక్షణం పుస్తకాలు చదవడం : మైక్రోసాఫ్ట్ సర్వీస్ కొంతకాలం క్రితం ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వంద మందిని ఎంపిక చేసి, వారిలో ఉండే 4 కామన్ లక్షణాలను సర్వే చేసిందని నాగేశ్వరరావు చెప్పారు. అందులోని అంశాలు లక్ష్యంపై దృష్టి పెట్టడం, సాహసోపేతమైన కృత్యాలు చేయడం, ఆరోగ్య పరిరక్షణ, శరీర దారుఢ్యం కోసం కృషి చేస్తారని ఆయన వివరించారు. విజేతలందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదవడమని, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా గొప్ప చదువరి అని, పుస్తక ప్రియుడని నాగేశ్వరరావు తెలిపారు.
బిల్‌గేట్స్ ఏడాదికి 50 పుస్తకాలు చదువుతారు : బిల్‌గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏటా 50 పుస్తకాలు చదువుతారని వివరించారు. అమెజాన్ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్ కూడా బుక్స్‌ను విపరీతంగా చదువుతారని, అదే విధంగా వారెన్ బఫెట్ కూడా పుస్తకాలను చదవడమే తన బలమని చెబుతారని నాగేశ్వరరావు అన్నారు. ఎలన్ మస్క్ కూడా తన ఆలోచనలకు మూలం పుస్తకాలే అని చెబుతారన్న ఆయన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఎక్కువగా పుస్తకాలు చదివేవారని అన్నారు.
"రామోజీరావు గారి పేరు ఈ వేదికకు పెట్టడం అత్యంత సముచితం. ఎందుకంటే పుస్తకాన్ని, అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన యాబై ఏళ్లపాటు ఒక తపస్విలా అక్షర తపస్సు చేసి 2024 సంవత్సరంలో వెళ్లిపోయారు. ఆయన స్మృతిలో ఈ వేదికకు నామకరణం చేశారు. చదవడం అలవాటైతే గెలవడం అలవాటు అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనం చదువును మరిచిపోయాం. అందువల్లే మనం ఒక ఉనికి కోల్పోతున్నటువంటి జాతుల్లో తెలుగుజాతి ఒకటి. ఎందుకంటే 12 కోట్ల మంది తెలుగువాళ్లు ఉంటే ఒక పుస్తకాన్ని 12వేల కాపీల్ని కూడా అమ్మలేని దుస్థితి నెలకొంది. విద్యావిధానంలో పుస్తకాన్ని భాగం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కోరుతున్నాను" - ఎం. నాగేశ్వరరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్
చదవడం ద్వారానే ఉత్తమపౌరులు తయారవుతారు : 12 కోట్ల మంది తెలుగువాళ్లుంటే ఒక కొత్త పుస్తకం 12 వేల కాపీలు కూడా అమ్ముడు పోవడంలేదని నాగేశ్వరరావు అన్నారు. బరాక్ ఒబామా తన జీవిత చరిత్ర పుస్తకం ద్వారా కోట్ల రూపాయలు రాయల్టీ ద్వారా సంపాదించారని తెలిపారు. చదవడం ద్వారానే మంచి పౌరులు తయారవుతారని, రామోజీరావు పుస్తకాలు ఎక్కువగా చదివేవారని గుర్తు చేసుకున్నారు. ఈనాడు పత్రికకు రామోజీరావే ఫస్ట్ రీడర్, ది బెస్ట్ రీడర్ అని ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు.
'భాషను బతికించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది - తెలుగు భాష మన అస్తిత్వం'