How to Make Tomato Dhania Shorba: తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. పగలు మొత్తం ఎండ ఉన్నా.. సాయంత్రమైతే చాలు మంచు కురుస్తుంది. ఇక ఈ చలికాలంలో ఏం తిన్నా, తాగినా వేడివేడిగా ఉండేలా చూసుకుంటాం. ముఖ్యంగా ఎక్కువ శాతం వేడివేడి రసాలు, సూప్‌లు ఉండేలా చేస్తుంటారు మహిళలు. అయితే.. మనకు సూప్‌లు ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో టమాటా కొత్తిమీర సూప్ ఒకటి. ఈ సూప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కొద్దిమందికి ఈ సూప్ చేయడం రాదు.. ఒకవేళ చేసినా పల్చగా తయారవుతుంటుంది. దీంతో.. చేసేది లేక బయటి నుంచి ఇన్స్టంట్ సూప్ పొడులు తెచ్చుకుని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారు ఈ స్టోరీలో చెప్పే టిప్స్, కొలతలు పాటిస్తూ చేస్తే ఈ సూప్ రుచి అద్దిరిపోతుంది. పైగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ హెల్దీ సూప్‌ని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- నెయ్యి లేదా బటర్ - అర టీ స్పూన్
- నూనె - 1 టీ స్పూన్
- దంచిన వెల్లుల్లి - 3
- దంచిన అల్లం - అర ఇంచ్
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- యాలకులు - 3
- లవంగాలు - 2
- బిర్యానీ ఆకు - 1
- మిరియాలు - అర టీ స్పూన్
- గోధుమ పిండి - 1 టీ స్పూన్
- టమాట - పావు కిలో
- కొత్తిమీర - 100 గ్రాములు
- కారం - అర చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి - 2
- వాటర్ - అర లీటర్
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి లేదా బటర్, నూనె వేసుకోవాలి.
- ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, దంచిన అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత గోధుమపిండి వేసి మంటను సిమ్‌లో పెట్టి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి ఓ నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను శుభ్రంగా కడిగి కాడలతో సహా వేసుకోవాలి. ఆ తర్వాత అర చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
- అనంతరం పచ్చిమిర్చిని తుంచి వేసుకుని మూత పెట్టి మంటను సిమ్‌లో పెట్టి టమాటలు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత అందులోకి అరలీటర్ నీళ్లు పోసుకుని సిమ్‌లో పెట్టి నిధానంగా మరగనివ్వాలి.
- లో-ఫ్లేమ్ మీద ఈ సూప్ చేసుకుంటే రుచి బాగుంటుంది. నీళ్లు సగానికి అయ్యేవరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత ఓ జెల్లెడలో ఈ మిశ్రమాన్ని వేసి వడకట్టాలి. టమాటా ముక్కల్లోని సారం అంతా సూప్‌లోకి జారాలే గరిటెతో మెత్తగా మెదుపుతూ సూప్‌ను వడకట్టాలి.
- అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర సూప్ రెడీ. దీనిపైన కాస్త కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుని వేడివేడిగా తాగుతుంటే ఉంటుంది.. ఆ ఫీలింగ్ చెప్పలేమంటే నమ్మండి. అంత బాగుంటుంది. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.