Telangana Tourism Araku Package Details : అందమైన పర్వతాలు.. పాలధారను తలపించే జలపాతాలు.. చిరుజల్లు లాంటి మంచు.. మత్తెక్కించే కాఫీ తోటల పరిమళాలు.. ఇలా ఒక్కటేమిటి అరకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మంచు పొరల చాటున కనిపించే అందాల గురించి చెప్పడం కాదు.. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా ఆస్వాదించాల్సిందే! ఆ కిక్ వేరే లెవల్ ఉంటుంది. అందుకే.. చాలా మంది హాలీడేస్ వస్తే అరకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. చలికాలంలో ఈ ప్రదేశం మరింత రమణీయంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వింటర్లో అరకును వీక్షించాలనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుంది.? ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి? టికెట్ ధరలు ఎంత వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తెలంగాణ టూరిజం "అరకు టూర్" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజులుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ నిర్వహిస్తారు. హైదరాబాద్ టూ అరకు ప్రయాణం సాగుతుందిలా..
- మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు IRO పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 6.30 గంటలకు CRO బషీర్‌బాగ్ చేరుకుని అక్కడి నుంచి తిరిగి జర్నీ స్టార్ట్ బయలు దేరుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో భోజనం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో ఫ్రెషప్ అనంతరం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కైలాసగిరి, సింహాచలం దేవాలయాలు దర్శించుకున్న తర్వాత రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం విజిట్ చేస్తారు. ఆ సాయంత్రం వైజాగ్ బీచ్‌కు తీసుకెళ్తారు. బీచ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రి భోజనం తర్వాత వైజాగ్ హోటల్‌లో స్టే చేయాలి.
- మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అరకు టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడకి చేరుకున్న తర్వాత ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలు విజిట్ చేస్తారు. రాత్రికి ధింసా డ్యాన్స్ వీక్షిస్తారు. ఆ రాత్రికి అరకులో స్టే చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం అరకు నుంచి అన్నవరానికి బయలుదేరుతారు. అక్కడ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ రిటర్న్ అవుతారు. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఇక ధరలు చూస్తే..హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్‌కు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 6,999గా ఉంటుంది. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 5,599గా ధరలు నిర్ణయించారు.