Psychiatrist Advice for Family Problem :ప్రతి అమ్మాయి పెళ్లికి ముందు ఎన్నో ఊహలు, కలల్లో విహరిస్తుంది. వీకెండ్స్‌లో అలా శ్రీవారితో కలిసి బైక్‌పై షాపింగ్‌కి వెళ్లాలని, మంచి థియేటర్లో సినిమా చూడాలని.. రెస్టారెంట్లో భోజనం చేయాలని అనుకుంటుంది. ఇవన్నీ ఈ రోజుల్లో సాధారణ కోరికలే. కానీ.. ఇవి తనకు తీరని కోరికలుగా మిగిలిపోయాయని ఆవేదన చెందుతోంది ఓ మహిళ. ఇంతకీ.. ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
'మాకు పెళ్లై ఏడాది అవుతోంది. మా ఆయన చాలా గారాబంగా పెరిగారు. చిన్న పని చేయడానికీ భయపడతారు. కనీసం బండి నడపడం కూడా రాదు. ప్రతి చిన్నపనికీ అమ్మానాన్నలను అడుగుతారు. ఇలాంటి భర్తతో జీవితాంతంఎలా ఉండాలో తెలియడం లేదు. ఏం చేయాలో చెప్పండి' అంటూ.. మానసిక నిపుణుల సహాయం కోరుతోంది ఓ మహిళ. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్ మండాది గౌరీదేవి' చక్కటి పరిష్కారం చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ సరదా కూడా తీర్చుకోలేరు!
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను బాగా గారాబంగా పెంచుతుంటారు. ఇంట్లో, బయట ఏ పని చేయనివ్వకుండాప్రేమగాచూసుకుంటుంటారు. ఇలా వారి బాల్యం ప్రేమ, అప్యాయతలతో మొత్తం గడిచిపోయి యుక్తవయసులోకి అడుగుపెడతారు. అప్పుడు కూడా తల్లిచాటు బిడ్డలా ఏదో కాలం గడుపుతారు. స్నేహితులతో కలవకుండా.. బైక్ నడపడం నేర్చుకోకుండా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తుంటారు. దీంతో, పెళ్లైన తర్వాత భార్యతో బైక్‌పై షికారుకు వెళ్లాలనిపించినప్పుడు ఆ సరదా కూడా తీర్చుకోలేరు.
"పిల్లలు దెబ్బలు తగిలించుకుంటారనో.. ప్రమాదాలు జరుగుతాయనో కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని అతిజాగ్రత్తగా పెంచుతుంటారు. కనీసం ఆటలు ఆడడం, సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి కూడా చేయనివ్వరు. ఫ్రెండ్స్‌తోనూ కలవనివ్వరు. దాంతో.. వాళ్లు జీవితానికి అవసరమైన కీలక నైపుణ్యాలూ నేర్చుకోలేరు." -డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)