Potatoes Help In Reducing Weight :అనేక కారణాల వల్ల నేటి ఆధునిక కాలంలో ఎంతో మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరిగిన తర్వాత ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. అయితే.. మంచి డైట్ పాయిటిస్తే వెయిట్‌లాస్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్‌లో బంగాళాదుంపలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
పోషకాలు అధికం :
ఆలుగడ్డలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి. అలాగే విటమిన్ సి, బి6 వంటివి రోగనిరోధక శక్తి పెంచడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు డైట్‌లో బంగాళాదుంపలను భాగం చేసుకోవడం వల్ల వెయిట్‌లాస్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
తక్కువ కేలరీలు :
అధిక బరువుతో బాధపడేవారు తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి వారు బంగాళాదుంపలను (national library of medicine report)క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే.. ఇందులో చాలా తక్కువ కేలరీలుంటాయి. మీడియమ్ సైజ్ బంగాళాదుంపలో సుమారు 110 క్యాలరీలుంటాయట. 2014లో 'అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు డైట్‌లో బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల బరువు తగ్గారని నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ నికోలా M. మెక్‌కీన్' పాల్గొన్నారు.