తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చర్మం పొడిబారుతోందా? - ఇంట్లో లభించే ఈ నేచురల్​ మాయిశ్చరైజర్లు బెస్ట్​​! - ఓసారి ట్రై చేయండి! - NATURAL MOISTURIZERS FOR WINTER

-వింటర్‌లో డ్రై స్కిన్ నుంచి కాపాడే సహజమైన మాయిశ్చరైజర్లు ఇవి -ఈ మాయిశ్చరైజర్లు వాడటం వల్ల చర్మం రోజంతా తేమగా, తాజాగా

Natural Moisturizers for Winter
Natural Moisturizers for Winter (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 1:20 PM IST

Natural Moisturizers for Winter:చలికాలం వచ్చిందంటే.. చర్మం పొడిబారటం, పెదాలు పగలటం, పాదాల పగుళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలు సమస్యలు వేధిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా వివిధ రకాల మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే బయట దొరికే వాటిలోని రసాయనాలు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. దానికి బదులు.. ఇంట్లో లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • బయట దొరికే మాయిశ్చరైజర్లు చర్మంపై ఎక్కువ సమయం నిలిచి ఉండవు. కాబట్టి రోజంతా తేమగా, తాజాగా ఉండాలంటే విటమిన్‌ ‘ఇ’ నూనెను వాడమంటున్నారు నిపుణులు. ఇది చర్మంపై సులువుగా పరచుకోవడంతో పాటు చర్మం లోపలి పొరల్లోకి బాగా ఇంకుతుందంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే ఈ నూనె ఎండ వల్ల కమిలిన చర్మానికీ చక్కటి పరిష్కారమని.. దీంతో పాటు కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె, ఆర్గన్‌ ఆయిల్‌.. వంటివి కూడా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయంటున్నారు.
  • పొడిబారిన చర్మానికి, పెదాలకు తేమనందించడంలో షియా బటర్‌ చక్కగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పునరుత్తేజితం చేసి మెరిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు.
  • కలబంద గుజ్జులో A, C, E, B12 ’.. వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన దురదను తగ్గించడంతో పాటు ఎక్కువ సమయం పాటు చర్మాన్ని తేమగా ఉంచుతుందంటున్నారు.
  • మజ్జిగ, పెరుగు.. వంటి పదార్థాల్లో ల్యాక్టిక్​ ఆమ్లం ఉంటుంది. చర్మానికి తేమనందించే గుణాలు ఇందులో ఎక్కువని.. అందుకే వీటిని ఫేస్‌మాస్కుల్లో భాగం చేసుకోవడం, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం.. వంటివి చేస్తే చక్కటి ఫలితాలు పొందచ్చంటున్నారు నిపుణులు.
  • రోజ్‌వాటర్‌లో చర్మానికి తేమనందించే గుణాలు పుష్కలంగా ఉంటాయట. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి.. నిర్ణీత వ్యవధుల్లో చర్మం లేదా ముఖంపై స్ప్రే చేసుకుంటే రోజంతా తేమగా, తాజాగా ఉండచ్చని వివరిస్తున్నారు నిపుణులు.
  • నీటి శాతం అధికంగా ఉండే కీరాదోస.. చర్మానికి తేమనందించడంలో సహకరిస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం దీన్ని తినడమే కాకుండా.. దీంతో ప్యాక్స్ తయారుచేసుకొని కూడా ఉపయోగించచ్చంటున్నారు. లేదంటే కీరా స్లైసుల్ని కనురెప్పలపై, ముఖమంతా పరచుకొని కాసేపు సేదదీరితే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
  • బాగా పండిన అరటిపండ్లను పడేస్తుంటారు చాలా మంది. అలా కాకుండా వాటిని పేస్ట్‌లా చేసుకొని చర్మంపై అప్లై చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందులో అధికంగా ఉండే విటమిన్‌ ‘సి’ పొడిబారిన చర్మానికి తిరిగి తేమనందించి.. మెరిసేలా చేస్తుందని అంటున్నారు.
  • పొడి చర్మం ఉన్న వారు తేనెతో చర్మాన్ని మర్దన చేసుకొని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు మేను మెరిసిపోతుందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే అయినప్పటికీ చర్మతత్వాలను బట్టి కొంతమందికి కొన్ని పడకపోవచ్చని.. కాబట్టి వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మర్చిపోవద్దంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details