Telangana Intermediate Exams 2025 : వార్షిక పరీక్షల షెడ్యూల్ రాగానే ప్రతి ఒక్క విద్యార్థిలో అలజడి మొదలవుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సన్నద్ధం అయితే ఒత్తిడి దరిచేరదని, ఎక్కువ మార్కులు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచనలు చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి నెల 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ నెల ఆఖరున జరుగుతున్న ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఎగ్జామ్స్ బాగా రాయలేమోనని, ఫెయిల్ అవుతామేమోనని, భవిష్యత్తు ఏమవుతుందోనని కొందరు అవేదన చెందుతున్నారు. ఇలాంటి టైంలో విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇంటర్ విద్యాశాఖ ‘టెలిమానస్’ కార్యక్రమం చేపడుతోంది. కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ - 14416 ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి 'టెలిమానస్' ప్రతి కళాశాలలో అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో తొలిదఫా సదస్సులు పూర్తయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లోనూ ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
కౌన్సిలింగ్ ద్వారా సానుకూల దృక్పథం : పరీక్షలంటే భయం వీడేలా విద్యార్థులకు విద్యాశాఖ, మానసిక వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు, ఒంటరితనం నుంచి బయట పడేందుకు, స్వీయ విశ్వాసం పెంపొందించుకునేందుకు, సోషల్ మీడియాను కొన్ని రోజుల పాటు పక్కనపెట్టేందుకు, దురలవాట్లకు దూరంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు చెబుతారు.
- విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు కాలేజీల వారీగా ఇద్దరు చొప్పున అధ్యాపకులను నియమించారు.
- విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్ - 14416కు ఫోన్ చేసినా మానసిక స్థిరత్వాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంపై విద్యానిపుణులు, మానసిక వైద్య నిపుణులు, తదితరులు సూచనలు ఇస్తారు.
- సమయ నిర్వహణ, చదువుల ప్రణాళిక, ఒత్తిడి నియంత్రణ పద్ధతులను వారు తెలియజేస్తున్నారు.
- విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను గుర్తించి కౌనెల్సింగ్ ద్వారా సత్వర సాయం అందిస్తున్నారు.
- నీట్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నారు.
పరీక్షలంటే భయపడుతున్నారా? - అయితే ఈ నంబర్‌కు ఫోన్ కొడితే సరి!