Lemon Plant Growing Tips :మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇంటి అవసరాల కోసం చాలా మంది తమ తమ ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. అందులో నిమ్మ కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇంట్లో కుండీల్లో లేదా పెరట్లో పెంచుతుంటారు. నిమ్మకాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే.. కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల నిమ్మ చెట్లలో ఎదుగుదల ఉండదు. మరికొన్ని చెట్లు ఏపుగా పెరిగినా.. కాయలు మాత్రం కాయవు. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయని.. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెట్టు ఆరోగ్యంగా పెరిగి కాయలు కాస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పోషకాలు కావాలి: మనం ఇంట్లో లేదా పెరట్లో పెంచే ఏ మొక్కకైనా సరైన పోషణ అవసరం. అప్పుడే అవి ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ క్రమంలోనే నిమ్మ చెట్లకు కూడా పోషకాలు అవసరమే. వాటిల్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ తదితరాలు ముఖ్యమైనవి. ఈ పోషకాలు సరిపడా నిమ్మ చెట్టుకు అందితే పుష్కలంగా కాయలు కాస్తాయంటున్నారు.
సరైన ప్రదేశంలో పెట్టాలి:నిమ్మచెట్టును పెంచేందుకు సరైన సూర్యకాంతి కావాలని నిపుణులు అంటున్నారు. కుండీల్లో పెంచితే సూర్యకాంతి పడే చోట వాటిని పెట్టాలని.. అదే పెరట్లో నాటితే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో నాటాలని చెబుతున్నారు. సూర్య కాంతి సరిగా ఉంటే నిమ్మ చెట్టు పెరుగుతుందని.. కాయలను కాస్తుందని అంటున్నారు. తగినంత సూర్యకాంతి లేకపోతే కాయలు తక్కువగా వస్తాయని లేదా కొన్ని సార్లు చెట్లకు కాయలే ఉండకపోవచ్చంటున్నారు.
నీరు తగినంత ఉండాలి: నిమ్మచెట్టుకు పూత ఏర్పడినప్పుడు దానికి సరైన నీరు, పోషకాలు అందేలా చూడాలని.. దీంతో పూత రాలిపోకుండా ఉండి కాయలు ఎక్కువగా కాస్తాయంటున్నారు. పూత వచ్చిన సమయంలో నీరు సరిపడా లేకపోయినా, పోషకాలు అందకపోయినా పూత రాలుతుందని.. కాపు తక్కువగా ఉంటుందంటున్నారు.