తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"కోర్టు కేసు వాయిదాలకు తిరగలేకపోతే.. అలా చేయొచ్చు!" - LEGAL ADVICE FOR COURT ADJOURNMENT

- విడాకుల కేసు వాయిదాలపై ఓ మహిళ ఆవేదన - న్యాయ నిపుణులు చేసిన సూచన ఇదే!

Legal Advice For Court Adjournment
Legal Advice For Court Adjournment (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2024, 2:54 PM IST

Legal Advice For Court Adjournment : ఇటీవల కాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. పలు రకాల కారణాలతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రమవుతున్నాయి. అవి భరించలేని వారు కోర్టు మెట్లు ఎక్కడమే అంతిమ పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలాంటి ఒక కేసు గురించే ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం.

"మాకు పెళ్లై ఆరు సంవత్సరాలు.. ఇన్నేళ్ల కాలంలో అత్తవారింట్లో వేధింపులు భరించలేకపోయాను. దీంతో గృహహింస కేసు వేశాను. అప్పట్లోనే ఆ సమస్య పరిష్కారమైంది. కానీ.. ఆ తర్వాత కొంత కాలం నుంచి నా భర్త కావాలనే నా వ్యక్తిత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. నా ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గత సంవత్సరం అనంతపురంలో విడాకుల కేసు వేశాడు. అయితే.. నేను వైజాగ్​లో జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతిసారీ వాయిదాలకు విశాఖ నుంచి అనంతపురం వెళ్లి రావడం చాలా కష్టంగా ఉంది. ఈ కేసును నేను నివసించే ప్రాంతానికి ట్రాన్స్​ఫర్ చేయించుకోవచ్చా? ఒకవేళ ఇద్దరం విడాకులు తీసుకోవాల్సి వస్తే.. నా నిజాయతీని ఎలా నిరూపించుకోవాలి?" అని ఓ సోదరి న్యాయ నిపుణులను సలహా అడిగారు. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

హిందూ వివాహచట్టంలో ఉన్న సెక్షన్‌-19 ప్రకారం.. సాధారణంగా పెళ్లి జరిగిన చోటు, ప్రతివాది ఉన్న ప్రాంతంలో కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భార్యాభర్తలుగా ఇద్దరూ కలిసి ఆఖరిసారిగా నివాసం ఉన్న ఊరుకు దగ్గరగా ఉన్న జిల్లా కోర్టులో కేసు వేయాలి. ఈ లెక్కన మీ భర్త విడాకుల కేసు అనంతపురంలో దాఖలు చేయడానికి ఈ మూడింటిలో ఏది కారణమో తెలుసుకోండి.

ఆ ప్రాంతానికీ, మీకు సంబంధం లేకపోతే, కచ్చితంగా ప్రతివాదైన మీరు ఎక్కడ నివసిస్తున్నారో.. అక్కడే కేసు వేయాల్సి ఉంటుంది. సెక్షన్‌ 19(2) ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అందువల్ల మీరు ముందుగా.. హైకోర్టులో ఒక పిటిషన్ వేయండి. ఉద్యోగరీత్యా విశాఖలో నివసిస్తున్న విషయాన్నీ.. అక్కడి నుంచి కోర్టు వాయిదాలకు తిరగలేకపోతున్న విషయాన్ని, ఇందుకు గల కారణాలను వివరిస్తూ కేసు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేయండి.

అంతేకాదు.. మీ అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే వరకు.. అనంతపురం కోర్టులో ప్రొసీడింగ్స్‌ ఆపాలని కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించొచ్చు. ఇదేవిధంగా.. ఈ విడాకుల కేసులో మీపైన చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేయండి. అప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి.. వాటిని నిరూపించాల్సి ఉంటుంది. అది జరగాలంటే.. తగిన ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించాలి. అలా చూపించలేకపోతే కోర్టు ఆ కేసును కొట్టేస్తుంది.

మీరు వివరాలు సమర్పించండి..

మీ భర్త చెబుతున్నవన్నీ అబద్ధాలని, కావాలనే చేస్తున్న ఆరోపణలనే మీ వాదనలకు బలం చేకూరడానికి.. మీరు వేసిన గృహ హింస కేసు తాలూకూ పేపర్లు చూపించండి. అవన్నీ పరిశీలించినప్పుడు, కావాలనే అతను అబద్ధం చెప్పాడనే విషయం అర్థమవుతుంది. కాబట్టి.. ఆందోళ చెందకుండా మంచి లాయర్‌ని సంప్రదించండి అని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details