Latest Kitchen Tools :మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లోచాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని స్మార్ట్ కిచెన్ వస్తువులు మీ పనుల్ని మరింత సులువు చేస్తాయి. అవేంటో మీరు ఓసారి చూడండి..
నూనె చేతిపై పడకుండా :పూరీ, పకోడీ, చికెన్, బజ్జీల వంటి డీప్‌ఫ్రై వంటకాలు జాగ్రత్తగా చేయాలి. నూనెలో నుంచి వాటిని బయటకు తీసే టైమ్‌లో కొన్నిసార్లు జారి అందులోనే పడిపోతుంటాయి. దానివల్ల ఆయిల్ చింది మీద పడి బొబ్బలెక్కే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి భయం లేకుండా ఉండడానికి కిచెన్‌లోకి 'ఫిల్టర్ స్పూన్ విత్ క్లిప్' (Filter spoon with clip) ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనికి స్టీల్ జల్లెడ, స్పూను రెండూ ఎటాచ్ అయి ఉంటాయి. జల్లెడతో వంటకాలను బయటకు తీసి, స్పూన్‌తో పడిపోకుండా పట్టుకోవచ్చు. దీంతో నూనె చిందుతుందన్న భయం ఇకమీదట ఉండదు.
అల్లం, వెల్లుల్లి కోసం (Crusher for ginger and garlic):మనందరి ఇళ్లలో నిమ్మకాయల నుంచి రసం తీయడానికి క్రషర్ ఉంటుంది. అయితే.. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి కోసం ఓ క్రషర్ వచ్చేసింది. దీంతో అప్పటికప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలనూ పేస్టులాగా చేసుకోవచ్చు.
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ (Portable gas stove):దాదాపు మన ఇళ్లలో రెండు, మూడు బర్నర్స్ ఉన్న స్టవ్‌లు వాడుతుంటాం. కొందరికి అలాంటివి అవసరం లేకపోవచ్చు. ఇలాంటి వారికి 'పోర్టబుల్ గ్యాస్ స్టవ్' బాగా ఉపయోగపడుతుంది. దీనికి మన వద్ద ఉండే సిలిండర్‌ను ఫిక్స్ చేసి వాడుకోవచ్చు. లేకపోతే.. దానికే ఓ చిన్న సిలిండర్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. పోర్టబుల్ కాబట్టి, విహారయాత్రలు, క్యాంపింగ్ లాంటి వాటికి వెళ్లినప్పుడు దీన్ని మనతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. ట్రిప్‌లో బయటి ఆహారం అవసరం లేకుండా మనమే వండుకోవచ్చు.