Adilabad District Does Not Have Regular DEO : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదిలాబాద్ జిల్లాపై చిన్నచూపు చూస్తోందా, రెగ్యులర్ విద్యాశాఖాధికారి (డీఈవో)ను నియమించడంలో శ్రద్ధ చూపడం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న వారు దీర్ఘాకాలిక సెలవులు పెట్టుకుని జిల్లాను వదిలించుకుంటున్నారు. కొందరు పని చేసిన కాలంలో కార్యాలయం పనులు తప్ప పర్యవేక్షనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు జిల్లా అదనపు బాధ్యతలు నిర్వహించిన మంచిర్యాల డీఈవో యాదయ్య ఈ నెల ప్రారంభం నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో ఇక్కడ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న గమానియల్‌కు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనుండటం గమనార్హం.
పర్యవేక్షణ అంతంతమాత్రంగానే : గతేడాది సెప్టెంబరు వరకు రెండు సంవత్సరాలకు పైగా డీఈవో పూర్తి అదనపు బాధ్యతల(ఎఫ్‌ఏసీ)తో పనిచేసిన పార్శి అశోక్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ విద్యావ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. అనంతరం తన సొంత పోస్టు డైట్ కళాశాల విధుల్లో చేరారు. అనంతరం మంచిర్యాల డీఈవో యాదయ్యకు ఎఫ్‌ఏసీ ఇచ్చారు. రెండు జిల్లాల బాధ్యతలు మోయలేకపోయిన ఆయన జిల్లా పర్యవేక్షణపై దృష్టి సారించలేక పోయారనే విమర్శలు తలెత్తాయి. పరిపాలనాపరమైన పనులకు ఆటంకం లేకుండా నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంతంతమాత్రంగానే సాగింది. పదో తరగతి ఫలితాల్లో జిల్లా కొన్నేళ్లుగా రాష్ట్రంలో చివరి మూడు స్థానాలకే పరిమితమవుతోంది. ఈ క్రమంలో ఫలితాలను మెరుగుపర్చుకుని పరువు నిలపాల్సిన సమయంలో రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ప్రభావం పడే అవకాశం ఉంది.
తప్పకుండా నియమిస్తామని మూడు నెలలు : జిల్లా విద్యావ్యవస్థను గాడిన పడేసేందుకు అందుబాటులో ఉండే రెగ్యులర్ డీఈవోను నియమించాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడికి రెగ్యులర్ డీఈవోను ఇవ్వాలని కలెక్టర్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులను కోరినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ డీఈవోను ఇవ్వలేని పరిస్థితుల్లో జిల్లా అధికారుల్లో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించి విద్యావ్యవస్థన కుంటుపడకుండా చూడాలని కలెక్టర్ ఆలోచన చేసినట్లు సమాచారం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంచార సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ సభలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కకు రెగ్యులర్ డీఈవో ఇవ్వాలని ప్రాతినిధ్యం చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. తప్పకుండా నియమిస్తామని తెలిపారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా ఇంకా నెరవేరడం లేదు.
ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపి లక్ష్యాలు : జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 1230 పాఠశాలలుండగా 90వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. 6,421 మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఫలితాల్లో జిల్లాను మందుంచాలని కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఇప్పటికే రెండు సార్లు ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపి లక్ష్యాలు నిర్దేశించారు. 42 రోజుల ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తున్నారు. వీటిని దగ్గరుండి చక్కబెట్టాల్సిన జిల్లా విద్యాశాఖాధికారి అవశ్యకత ఎంతైనా ఉంది.