India vs England 2nd ODI : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమ్ఇండియా రెండో వన్డేలోనూ జయ కేతనం ఎగురవేసింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో(119) విధ్వంసం సృష్టించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ భారీ లక్ష్యాన్ని టీమ్ఇండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చాలాకాలం తర్వాత సెంచరీ బాదాడు. హిట్‌మ్యాన్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (5) ఆశించిన స్థాయిలో ఆడలేదు. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ నిరూపించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (44; 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (41*; 43 బంతుల్లో 4 ఫోర్లు) మంచి ప్రదర్శన చేశారు. కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్య (10), రవీంద్ర జడేజా (11*) రన్స్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఒవర్టన్ 2, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టన్, అట్కిన్సన్ తలో వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జో రూట్ (69; 72 బంతుల్లో 4 ఫోర్లు) అర్ధ శతకాలతో మంచి ప్రదర్శన చేశారు. హ్యారీ బ్రూక్ (31; 52 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (34; 35 బంతుల్లో 2 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (26: 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో లివింగ్‌స్టన్ (41; 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు 300 దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/35) అద్భుతమైన స్పెల్ వేయగా. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్‌లో జరగనుంది.