Chilkur Balaji CS Rangarajan Attack : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఆ దేవుడిని కూడా అవమానించినట్లే : దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్న ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, స్వామి వారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే ఆ దేవుడిని కూడా అవమానించినట్లేనని అన్నారు.
"ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతిభద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతో ఉందో అది అత్యంత నీచమైన, దుర్మార్గమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసిన ఏ పేరిట చేసిన ఏ ఏజెండాతో చేసిన శాంతిభద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ భగవంతుని సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితే ఈ విధంగా ఉందంటే మరీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో దీనిని బట్టే చెప్పవచ్చు" -కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిని పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రులు @BrsSabithaIndra, @VSrinivasGoud, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే @KaushikReddyBRS, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, @balkasumantrs, బీఆర్‌ఎస్ నాయకులు… pic.twitter.com/cec0V2h5zC
— BRS Party (@BRSparty) February 10, 2025
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అసలేం జరిగింది : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై రెండు క్రితం(ఫిబ్రవరి 07) దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వచ్చి దాడి చేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రంగరాజన్ ఇచ్చిన ఫిర్యాదులో 'రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని తన ఇంటికి వచ్చిన వారు కోరగా తాను నిరాకరించాను. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించాను. దీంతో వాగ్వాదానికి దిగి తనపై దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన నా కుమారుడిపై కూడా దాడి చేశారు.' అని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలిపారు. అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి - ఆలస్యంగా వెలుగులోకి