HMDA Not Coming Forward for Auction : ఏడాది క్రితం కోకాపేటలో హెచ్‌ఎండీఏ భూములను ఆన్‌లైన్‌లో వేలం వేయగా, అక్కడ ఎకరం రూ.100 కోట్లు పలికింది. అక్కడ కొన్ని భూములు అమ్ముడుపోయాయి. మరికొన్ని అమ్ముడవక హెచ్‌ఎండీఏ విక్రయానికి నిరీక్షిస్తోంది. ఈ క్రమంలో భూములు, ప్లాట్ల ఆన్‌లైన్ వేలానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఎండీఏ మల్లగుల్లాలు పడుతోంది. ఈ మధ్యకాలంలో స్థిరాస్తి మార్కెట్‌లో ఏర్పడిన స్తబ్దత ప్రభావంతో వేలం నిర్వహిస్తే ఇబ్బందిగా మారుతుందని ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది.
ప్రస్తుతానికి హెచ్‌ఎండీఏకు పలు అభివృద్ధి పనులు చేయడానికి రూ.20 వేల కోట్ల వరకు అవసరం ఉంది. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో 1000 ఎకరాల పైనే భూములు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించారు. అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు సైతం రద్దయ్యాయి. ఇప్పుడు ఇలాంటి ప్లాట్లను 500 వరకు గుర్తించారు. ఈ ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయిస్తే సుమారు రూ.1000 కోట్లకు పైమాటే ఆదాయం సమకూరుతుంది.
ఆ సమయంలో భారీగా రేట్లు పెంచేశారు : గతేడాది హెచ్‌ఎండీఏ భూములను ఆన్‌లైన్‌లో వేలం వేసింది. ఈ క్రమంలో కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు పలికింది. అలాగే బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు అమ్ముడవగా, తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లను సిద్ధం చేయగా, కొన్ని మాత్రమే అమ్ముడయ్యాయి. అలాగే మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లను వేలం వేయగా, భారీగానే ధర పలికింది.
తొలి వాయిదా చెల్లించలేదు : కానీ తొలి వాయిదా చెల్లింపు విషయానికి వచ్చేసరికి చాలా మంది చేతులు ఎత్తేశారు. దీని కారణం తెలియనే వచ్చింది. ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములు ఉన్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రేట్లు పెంచినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో అధిక ధరకు కోట్ చేశారనే ఆరోపణలు సైతం వచ్చాయి. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులోకి ఉన్నాయంటే ఎంతలా రేట్లు పెంచారో అర్థం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సమయంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఊపు వచ్చిన తర్వాత వేలం వేస్తే మంచి డిమాండ్ ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
కోకాపేట నుంచి ఓఆర్ఆర్కు ప్రత్యేక రోడ్డు - ఆ 24 ఎకరాలకు భారీ డిమాండ్