Indian Cricketers Tax Strategies : ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఆదాయం వస్తుంటుంది. పని సామర్థ్యం, నైపుణ్యాలను బట్టి ఆదాయ స్థాయి నిర్ణయం అవుతుంది. మొత్తం మీద అందరి ఆదాయానికీ మూలం శ్రమే. భారత జట్టు క్రికెటర్ల ఆదాయం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు రకరకాల మార్గాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తుంటారు. బీసీసీఐ అందించే వేతనాలు, భత్యాలతో పాటు ప్రైవేటు కంపెనీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా అదనపు ఆదాయాలను గడిస్తుంటారు. వెరసి, సంవత్సరం తిరిగే సరికి వారి వార్షిక ఆదాయాలు భారీగా పెరిగిపోతుంటాయి. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు టీమిండియా క్రికెటర్లు అనుసరించే టాప్-5 పన్ను వ్యూహాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.
భారీ ఆదాయాలు- తెలివిగా వ్యూహరచన
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పలు కీలక సంస్కరణలు ఉన్నాయి. వీటిని వినియోగించుకుంటే మధ్యతరగతికి చెందిన ప్రజానీకం ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. ఇక నుంచి సంవత్సరానికి రూ.12 లక్షల దాకా సంపాదన ఉన్న వారికి ఆదాయపు పన్ను ఉండదు. వేతనాలు పొందే వారందరికీ ఇది చాలా పెద్ద శుభవార్త. అయితే లాభదాయకమైన కాంట్రాక్టులను పొందే వారికి, టాప్ క్లాస్ క్రికెటర్లకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చినట్లు కనిపించడం లేదు. భారత క్రికెటర్లలో చాలా మందిపై టాప్ కేటగిరీ ఆదాయపు పన్ను శ్లాబ్‌ల లెక్కల పన్నులు విధిస్తుంటారు. వారి వార్షిక ఆదాయాలు అంత భారీగా ఉంటాయి మరి. బీసీసీఐ వేతనాలు, ఐపీఎల్ మ్యాచ్‌ల ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు టీమిండియా ప్లేయర్లపై కాసులు కురిపిస్తుంటాయి. అయినా వారు సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలివిగా వ్యూహరచన చేసుకొని, పన్నుల నుంచి మినహాయింపులు పొంది నికర ఆదాయాలను పెంచుకుంటున్నారు.
1. పన్ను ప్రణాళిక, పెట్టుబడులు
టీమిండియా క్రికెటర్లు పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ పథకాల జాబితాలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటివి ఉంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టే డబ్బులపై ఆదాయపు పన్ను చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్కీంలలో ఉండే నిధులను రియల్ ఎస్టేట్, మూచువల్ ఫండ్లు, స్టార్టప్‌లలో దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెడుతుంటారు. ఇలాంటి దీర్ఘకాలిక మూలధన నిధుల లాభాలను ఆర్జిస్తే అత్యల్పంగా పన్నులు విధిస్తారు.
2. విదేశీ ఆదాయం, ద్వంద్వ పన్నులు
భారత క్రికెటర్లకు విదేశాల నుంచి కూడా ఆదాయాలు వస్తుంటాయి. విదేశాల్లో నిర్వహించే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లలోనూ టీమిండియా ప్లేయర్లు ఆడుతుంటారు. అక్కడి నుంచి వచ్చే ఆదాయం అనేది డబుల్ ట్యాక్సేషన్ అవైడన్స్ అగ్రిమెంట్(DTAA) పరిధిలోకి వస్తుంది. దీని ద్వారా ఒకే ఆదాయానికి రెండు దేశాల్లో రెండుసార్లు పన్నును చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే విదేశీ ఆదాయ నిధులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
3. బిజినెస్ వెంచర్లు, కార్పొరేట్ పన్ను ప్రయోజనాలు
చాలా మంది భారత క్రికెటర్లు సొంతంగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్(ఎల్‌ఎల్‌పీ) కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా తమకు సంబంధించిన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆర్థిక వ్యవహారాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎల్ఎల్‌పీలు సంపాదించే వార్షిక ఆదాయంపై భారత క్రికెటర్లు కేవలం కార్పొరేట్ పన్నులు చెల్లిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లించేందుకు ఈ మార్గాన్ని సమర్ధంగా వాడుకుంటున్నారు. విరాట్ కొహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి వారు ఈ తరహా ఎల్ఎల్‌పీలను నిర్వహిస్తున్నారు.
4. హిందూ అవిభాజ్య కుటుంబాల ఖాతాలు, ట్రస్టులు
కొందరు భారత క్రికెటర్లు హిందూ అవిభాజ్య కుటుంబాల ఖాతాలు/ట్రస్టులను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి తమ స్థిరాస్తులు, చరాస్తులను బదిలీ చేస్తున్నారు. ఇలాంటి ఖాతాల్లోకి చేరే ఆదాయాలపై పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంలో చాలా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
5. లగ్జరీ ట్యాక్స్, జీఎస్‌టీ
చాలా మంది క్రికెటర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆతిథ్య రంగంపై ఫోకస్ చేస్తున్నారు. ఆతిథ్య రంగం అంటే హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీల వంటివి. పలువురు క్రికెటర్లు స్పోర్ట్స్ అకాడమీలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు తమ సొంత ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పరోక్ష పన్నుల బాదుడు నుంచి తప్పించుకునేందుకు వారు జీఎస్టీని సక్రమంగా చెల్లిస్తున్నారు.
ఉద్యోగులకు భారీ ఊరట- వారికి ఏటా రూ.1.10లక్షల ట్యాక్స్ ఆదా! మరి మీకెంతో తెలుసా?
'రూ.12లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ నిల్- పన్ను రేట్లలో మార్పులు'