తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పిండి రుబ్బకుండానే - నిమిషాల్లో అద్దిరిపోయే "రవ్వ వడలు"! - టేస్ట్ అదుర్స్! - INSTANT RAVA VADA RECIPE

- మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి సూపర్ రెసిపీ - నిమిషాల్లో సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

INSTANT RAVA VADA
Rava Vada Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 3:24 PM IST

Rava Vada Recipe in Telugu : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి ఏం చేసుకోవాలో తోయనప్పుడు ఈ సూపర్​​ రెసిపీని ట్రై చేయండి. ఇందుకోసం పప్పు నానబెట్టి, మిక్సీ పట్టుకోవాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు చాలా ఈజీగా నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. అదే, నోరూరించే "రవ్వ వడలు". టేస్ట్ అద్దిరిపోతుంది! బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా ఉండే ఈ వడలనుపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్​ టేస్టీ వడల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - 1 కప్పు
  • బంగాళదుంప - 1(మీడియం సైజ్​ది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - 1 టీస్పూన్
  • ఉల్లిపాయ - 1(చిన్నది)
  • సన్నని అల్లం తురుము - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • సన్నని కొత్తిమీర తరుగు - 1 టేబుల్​స్పూన్
  • సన్నని కరివేపాకు తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • పెరుగు - అరకప్పు
  • వంటసోడా - పావుటీస్పూన్
  • ఆయిల్ - వేయించడానికి సరిపడా

హోటల్ స్టైల్ "దహీ వడ" - ఇంట్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బంగాళదుంపను పొట్టు తీసి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, ఆయిల్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న సన్నని ఆలూ తురుము వేసుకొని వాటర్​ని మరిగించుకోవాలి.
  • నీళ్లు మరిగి పొంగు వస్తున్నప్పుడు అందులో బొంబాయి రవ్వనుకొద్దికొద్దిగా ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. రవ్వ మొత్తం వేశాక ఆ మిశ్రమం నీళ్లన్ని పీల్చుకొని గట్టిపడుతుంది. అప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆఫ్ చేసుకొని పాన్​ని దింపి మూతపెట్టి కాసేపు పక్కనుంచాలి. అంటే మనం కలపడానికి వీలుగా ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
  • రవ్వ కాస్త చల్లారాక దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో సన్నని ఉల్లిపాయ తరుగుని చేతితో మెదుపుకొని వేసుకోవాలి. ఆపై సన్నని అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, జీలకర్ర ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • అలాగే, పెరుగులో వంట సోడా కలుపుకొని దాన్ని ఆ మిశ్రమంలో వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్​గా, కాస్త స్టిక్కీగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ మీకు పెరుగు తగ్గిందనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని అయినా పిండిని కలుపుకోవచ్చు.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యే లోపు చేతిని నీటిలో తడుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని పగుళ్లు రాకుండా ఉండగా చేసుకోవాలి.
  • ఆపై దాన్ని వడ మాదిరిగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్​లో ఒక్కొక్క వడను ప్రిపేర్ చేసుకుంటూ ఆయిల్​లో వేసుకోవాలి.
  • అలాగే నూనెలో వేశాక వడల్ని వెంటనే టర్న్ చేయకూడదు. కాసేపు అయ్యాక టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా చక్కగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆపై ప్లేట్​లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ ఇన్​స్టంట్ "రవ్వ వడలు" రెడీ!
  • వీటిని పల్లీ, కొబ్బరి, అల్లం చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, నచ్చితే మీరూ ఓసారి బ్రేక్​ఫాస్ట్​లో వీటిని ట్రై చేయండి.

అదుర్స్​ అనిపించే "మరమరాల వడలు" - కేవలం నిమిషాల్లోనే రెడీ - టేస్ట్​ వేరే లెవల్​!

ABOUT THE AUTHOR

...view details