Crispy Dondakaya Fry Recipe : దొండకాయ పేరు చెబితే చాలు, చాలా మంది "అమ్మో దొండకాయ కర్రీనా" అంటూ మోహం చిట్లిస్తుంటారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అదే దొండకాయతో ఫ్రై చేస్తే మాత్రం పిల్లలతో పాటు పెద్దలూ చాలా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పెట్టే దొండకాయ ఫ్రైని అమితంగా ఇష్టపడుతుంటారు ఎక్కువ మంది. కానీ, ఇంటి వద్ద చేసుకుంటే అలా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికోసమే ఈ "వెడ్డింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై". ఈ స్టైల్లో చేసుకున్నారంటే అచ్చం కేటిరింగ్ వాళ్లు చేసే విధంగా అద్భుతమైన టేస్ట్‌తో నోరూరిస్తోంది. పైగా దీన్ని చేసుకోవడం కూడా సులువు. మరి, ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- దొండకాయలు - 300 గ్రాములు
- ఉప్పు - రుచుకి సరిపడా
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - తగినంత
- జీలకర్ర పొడి - అరటీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- శనగపిండి - 2 టేబుల్‌స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్
- ఆయిల్ - డీప్ ఫ్రైకి తగినంత
- పచ్చిమిర్చి - కొన్ని
- కరివేపాకు - కొద్దిగా
పాత కాలం నాటి "దొండకాయ పల్లీల పచ్చడి" - తాలింపు లేకుండానే అద్దిరిపోతుంది!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా తాజా దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కట్ చేసుకున్న దొండ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కార్న్‌ఫ్లోర్(మొక్కజొన్న పిండి), శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి.
- వీలైనంత వరకు దొండకాయ ముక్కల్లో వాటర్‌తోనే ఇంగ్రీడియంట్స్ ముక్కలకు చక్కగా పడుతాయి. ఒకవేళ మరీ డ్రైగా అనిపిస్తే మాత్రం ఒకటి రెండు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి.
- ఇంగ్రీడియంట్స్ అన్నీ దొండ ముక్కలకు పట్టేలా మంచిగా మిక్స్ చేసుకున్నాక నిమ్మరసం వేసుకొని మరోసారి బాగా కోట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక స్టౌ లో-ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని కోట్ చేసుకున్న దొండకాయ ముక్కల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకోవాలి.
- మొత్తం వేసుకున్నాక స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలపకుండా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో వైపునకు టర్న్ చేసుకొని అన్ని వైపులా ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి.
- ఆ విధంగా ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే, కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
- ఆ తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో వేసి కలుపుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "వెడ్డింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై" రెడీ!
నోరూరించే 'దొండకాయ 65' - నిమిషాల్లోనే రెడీ అవుతుంది - టేస్ట్ వేరే లెవల్!